Congress: కాస్త అప్‌డేట్‌ అవ్వండి బాసూ.. ఇలా ఎందుకు చేస్తున్నారు?

ప్రాక్టిక‌ల్‌గా ఏమాత్రం వ‌ర్క్‌అవుట్‌ కాని విష‌యాల్ని బ‌ల‌వంతంగా త‌మ‌పై రుద్దితే ఎలా అంటూ కాంగ్రెస్ క్యాడ‌ర్ ఆవేద‌న చెందుతోందని పార్టీలో ఇన్నర్ టాక్.

Congress: కాస్త అప్‌డేట్‌ అవ్వండి బాసూ.. ఇలా ఎందుకు చేస్తున్నారు?

Updated On : April 4, 2025 / 8:07 PM IST

రంగం ఏదైనా అప్‌డేట్‌ అవ్వాల్సిందే.. పాత పద్ధతులనే ఫాలో అవుతామంటే కుదరదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కావొచ్చు. కానీ ప్రజెంట్ ట్రెండ్‌ను అనుసరిస్తూ పోవాల్సిందే.. ఇప్పుడు ఇదంతా దేనికోసం అనుకుంటున్నారా.. ఈ మధ్య జాతీయ కాంగ్రెస్ మూస ధోరణిలోనే వెళ్తోందని ఆ పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారట. తెలంగాణలో ప్రజెంట్ పరిస్థితిని అర్థం చేసుకోకుండా. చెప్పింది చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారట. ఇంత‌కీ కాంగ్రెస్ పెద్దల తీరుపై పార్టీలో జ‌రుగుతున్న చ‌ర్చేంటి..?

రోమ్ త‌గ‌ల‌బ‌డుతుంటే.. నీరో చ‌క్రవ‌ర్తి ఫిడేల్ వాయించిన చందంగా ప్రస్తుత కాంగ్రెస్ ప‌రిస్థితి త‌యారైందనే గాసిప్ పొలిటికల్ సర్కిళ్లలో రీసౌండ్ చేస్తోంది. తెలంగాణ‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వ‌రుస స‌మ‌స్యలు చుట్టుముడుతున్నాయి. పార్టీ ప‌రంగా, ప్రభుత్వ ప‌రంగా ర‌క‌ర‌కాల స‌మ‌స్యలు వచ్చిపడుతుంటే. ఇవేమి ప‌ట్టన‌ట్లుగా ఇత‌ర అంశాల‌పై ఫోకస్ పెట్టాలని ఒత్తిడి చేస్తుందట జాతీయ కాంగ్రెస్ పార్టీ. రాజ‌కీయంగా తెలంగాణ‌లో ఉన్న సిచ్యువేష‌న్ ఏంట‌నేది క‌నీసం ప‌ట్టించుకోకుండా నీరో చ‌క్రవ‌ర్తిలా వ్యవ‌హ‌రిస్తోంద‌ట‌.

130 ఏళ్ల చరిత్ర కాంగ్రెస్ సొంతం. దేశాన్ని అత్యధిక సంవత్సరాలు పాలించిన పార్టీ. ఎన్నో క్లిష్ట పరిస్థితుల్ని చవి చూసింది. ఎందరికో రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది. ఎన్నో సంస్కరణలకు పునాదులు వేసింది. ఇలా ఎన్నో మార్పులకు నాంది పలికిన కాంగ్రెస్‌లో ఇప్పుడు పాత వాసనలు పోవడం లేదనే అపవాదు మూటగట్టుకుంది. కాంగ్రెస్ పార్టీలో వందేళ్లుగా అనుస‌రిస్తున్న పాత పద్ధతులనే ఇప్పటికీ అనుస‌రిస్తున్నారట. దీంతో కొత్తత‌రం నేత‌లకు అస్సలే నచ్చడం లేదనేది పార్టీలో ఇన్నర్ టాక్.

ఈ నిర్ణయంతో క్యాడర్‌కు చిరాకు?
జాతీయ స్థాయిలో పార్టీ తీసుకున్న ఒక నిర్ణయం క్యాడర్‌కు చిరాకు పెట్టిస్తుందనే గాసిప్స్ గాంధీభవన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ నిర్ణయమే జై బాపు, జైభీమ్‌, జై సంవిధాన్.. ఈ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా ఏడాది పాటు నిర్వహించాల‌ని నిర్ణయించింది కాంగ్రెస్ అధిష్టానం. భారత రాజ్యాంగాన్ని ఎన్డీఏ సర్కార్ నిర్వీర్యం చేస్తోంద‌ని.. రాజ్యాంగంపై ప్రజ‌లకు అవ‌గాహ‌న క‌ల్పించడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది హస్తంపార్టీ హైకమాండ్.

జైబాపు, జైభీమ్‌, జైసంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామం, మండ‌లం, జిల్లా కేంద్రాల్లో ప్లకార్డుల‌తో ర్యాలీలు చేపట్టాలి. ప్రభుత్వం అవ‌లంభిస్తున్న విధానాల‌పై ప్రజ‌ల్లో చ‌ర్చ పెట్టాల‌ని కాంగ్రెస్ జాతీయ నాయ‌క‌త్వం డిసైడ్ అయ్యింది. ఈ టెక్నాలజీ కాలంలో ర్యాలీలతో ప్రజలకు అవగాహన కల్పించడం సాధ్యం కాదని క్యాడర్ చెబుతోందట. ఐనా ఈ ప్రోగ్రామ్‌ను సక్సెస్ చేసి తీరాల్సిందేన‌ని ఒత్తిడి చేస్తుందట అధిష్టానం. నిత్యం జూమ్ మీటింగ్‌ల‌తో పాటు ప్రతీ నియోజ‌క‌వ‌ర్గానికి ఇన్‌చార్జ్‌లను వేసి ఎప్పటికిప్పుడు స‌మీక్షలు చేస్తుందట.

తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చి ఏడాదిన్నర కాలం అవుతోంది. ఇక్కడ ప్రభుత్వంతో పాటు పార్టీని అనేక స‌మ‌స్యలు వేధిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రతిప‌క్ష పార్టీలు చేస్తున్న వ్యతిరేక ప్రచారాల్ని తిప్పికొట్టడమే పెద్దగా సవాల్‌గా మారింది. మరోవైపు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజ‌ల్లోకి స‌మ‌ర్థవంతంగా తీసుకెళ్లలేక పోతున్నామనే నిరుత్సాహం నిండిపోయింది.

ఇలాంటి టైమ్‌లో జాతీయ నాయ‌క‌త్వం తీసుకునే నిర్ణయాల‌ను ఎలా ఇంప్లిమెంట్ చేయాల‌నే ప్రశ్నలు గాంధీభవన్‌లో వినిపిస్తున్నాయట. అంతేకాదు తెలంగాణ‌లో పెద్దగా ప్రభావం లేని బీజేపీ గురించి జ‌నంలో చ‌ర్చ పెట్టడం వ‌ల్ల ఏం ప్రయోజ‌నమని వాదిస్తున్నారట. ఇవేమీ పట్టించుకోని హైకమాండ్.. ఈ కార్యక్రమాన్ని ఖ‌చ్చితంగా అమలు చేసి తీరాల్సిందేన‌ని ఆదేశాలు ఇచ్చిందట.

ప్రాక్టిక‌ల్‌గా ఏమాత్రం వ‌ర్క్‌అవుట్‌ కాని విష‌యాల్ని బ‌ల‌వంతంగా త‌మ‌పై రుద్దితే ఎలా అంటూ కాంగ్రెస్ క్యాడ‌ర్ ఆవేద‌న చెందుతోందని పార్టీలో ఇన్నర్ టాక్. మరి కాంగ్రెస్ హైకమాండ్ క్యాడ‌ర్ ఎదుర్కొంటున్న స‌మ‌స్యను అధిష్టానం గుర్తిస్తుందా.. లేదా అనేది చూడాలి.