KTR : రాబోయే ప్రతి అడుగులో కేసీఆర్ దళంగా ఐకమత్యంగా ముందుకు సాగుదాం

ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకునే నిజాయితీ, చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి వుండదనేది గతనెల రోజుల ఎన్నికల అనంతర పరిణామాలను పరిశీలిస్తే మరోసారి రుజువైందని కేటీఆర్ అన్నారు.

KTR : రాబోయే ప్రతి అడుగులో కేసీఆర్ దళంగా ఐకమత్యంగా ముందుకు సాగుదాం

BRS Working President KTR

Updated On : January 9, 2024 / 2:41 PM IST

BRS Working President KTR : తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు రాజకీయ అస్తిత్వంగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను గెలిపించిందని, పదేళ్ల అనతికాలంలోనే దేశానికే ఆదర్శంగా నిలబెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది.  ఈసమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.. తెలంగాణ గళం బీఆర్ఎస్.. తెలంగాణ బలమూ బీఆర్ఎస్సే అన్నారు. రాబోయే ప్రతి అడుగులో కేసీఆర్ దళంగా ఐకమత్యంగా ముందుకు సాగుదామని కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ సాధించిన ఘనతను ప్రతిష్టను వెలుగొందుతున్న ప్రభకు ఏమాత్రం భంగం కలిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలదే అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందామని కేటీఆర్ సూచించారు.

Also Read : Maldives-Lakshadweep Issue : భారత్ – మాల్దీవుల వివాదం వేళ.. భారత్‌పై అక్కసు వెళ్లగక్కిన చైనా.. ఇజ్రాయెల్ అభ్యర్థన ఇదే..

ఖమ్మం వంటి ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదని కేటీఆర్ అన్నారు. 39 ఎమ్మెల్యే సీట్లను గెలవడంతోపాటు 11 స్థానాలు అత్యల్ప మెజారిటీతో చేజారిపోయాయని, ఇంకా కొన్నిచోట్ల మరికొన్ని కారణాలచేత కోల్పోయామని కేటీఆర్ చెప్పారు. ప్రజల్లో ఉన్న అసంతృప్తికి కారణాలు చర్చించుకుని, సమీక్షించుకుని ముందుకు సాగుదామని పార్టీ నాయకులు, శ్రేణులకు కేటీఆర్ సైూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెలదాటింది. అధికారంలోకి వచ్చిన మరుసటిరోజు మా వాగ్దానాలు అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర వర్గాలకు ఇచ్చిన హామీల అమలులో కాలాయపన దిశగా అడుగులేస్తున్నదని, కాంగ్రెస్ ప్రభుత్వం నెల రోజుల పోకడ ఇదే విధానాన్ని స్పష్టం చేస్తుందని కేటీఆర్ అన్నారు.

Also Read : జగన్ ఏమైనా కాంగ్రెస్ పార్టీనా? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు

వాగ్దానం చేసిన దానికి భిన్నంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించడం పట్ల ప్రజల్లో అసహనం ప్రారంభమైందని, ఇదిలాగే కొనసాగే పరిస్థితి ఉన్నదని, ప్రజల విశ్వాసాన్ని స్వల్పకాలంలో కోల్పోయే లక్షణం కాంగ్రెస్ పార్టీ సొంతమని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీని తిరస్కరించి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలు.. కేవలం ఏడాదిన్నర స్వల్పకాలంలోనే కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసాన్ని కోల్పోయారని కేటీఆర్ గుర్తు చేశారు. ప్రజా విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ అనంతరం జరిగిన నాటి లోకసభ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యిందని అన్నారు. ఆ ఎన్నికల్లో అదే ప్రజలు టీడీపీని తిరిగి భారీ మెజారిటీతో గెలిపించిన సంగతి తెలిసిందేనని, ఈ వాస్తవం మనం మరువకూడదని కేటీఆర్ చెప్పారు.

ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకునే నిజాయితీ, చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి వుండదనేది గతనెల రోజుల ఎన్నికల అనంతర పరిణామాలను పరిశీలిస్తే మరోసారి రుజువైందని కేటీఆర్ అన్నారు. ప్రజలకిచ్చిన వాగ్దానాల అమలుకోసం కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తెస్తూ తెలంగాణ ప్రజలకోసం బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని, ఈ దిశగా మన మందరం కార్యోన్ముఖులం కావాల్సివుంటుందని పార్టీ నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ సూచించారు.