MLC Dasoju Sravan: కేటీఆర్, హరీశ్ కృష్ణార్జునల లెక్క.. వారి విడదీయాలనే మీ కుట్రలు ఫలించవు- సీఎం రేవంత్‌పై దాసోజు శ్రవణ్ ఫైర్
రాముడికి హనుమంతుడు ఎట్లనో, కేసీఆర్ కు హరీశ్ అట్ల. కృష్ణార్జున లెక్క హరీశ్, కేటీఆర్ లు..

MLC Dasoju Sravan: సోషల్ మీడియా వేదికగా మాజీమంత్రి హరీశ్ పై సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారంపై గచ్చిబౌలి సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, మాజీ చైర్మన్ లు ఎర్రోళ్ల శ్రీనివాస్, సతీష్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగిన నాటి నుంచి కాంగ్రెస్ నాయకులకు నిద్ర పట్టడం లేదన్నారు దాసోజు శ్రవణ్. కేసీఆర్ ప్రసంగించిన నాటి నుంచి రేవంత్ రెడ్డికి, మంత్రులకు వణుకుడు మొదలైందన్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీపై రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు.
సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పని లేని పెద్ద మనిషి పిల్లి తల కొరిగిండు అన్నట్లుంది రేవంత్ తీరు అని విమర్శించారు. రేవంత్ రెడ్డికి పని చేయడం చేతకాదు, వాగ్దానాలు నెరవేర్చే ఆలోచన లేదు, అన్ని వర్గాల ప్రజలు సతమతమవుతుంటే మొద్దు నిద్ర నటిస్తున్నారు అని ధ్వజమెత్తారు. విమర్శల దాడి నుంచి తప్పించుకునేందుకు తప్పుడు ప్రచారం మొదలు పెట్టారని, కుట్రపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నారని, రాజకీయ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు దాసోజు శ్రవణ్.
ముఖ్యంగా బీఆర్ఎస్ మీటింగ్ అయిన రెండో రోజు నుంచి ప్రజా నాయకుడైన హరీశ్ రావు మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. దుష్ర్పచారం చేస్తున్నారు. ప్రజల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తున్న హరీశ్ పై సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ కుట్రలు చేస్తుండటం సిగ్గుమాలిన చర్య. నేరుగా ఎదుర్కునే దమ్ము లేక, అడ్డదారిలో నీతిమాలిన చేష్టలు చేస్తుండటం చేతకాని, చేవలేనితనానికి నిదర్శనం. ప్రజలను నమ్మించి, నయవంచన చేసిన రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నైతిక విలువలు లేనే లేవు.
అందుకే ఫేక్ పేపర్ క్లిప్స్ సృష్టించి షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పెయిడ్ బ్యాచ్ లతో పేజీలు పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చిల్లర చేష్టలతో దుష్ప్రచారం చేసినంత మాత్రాన సద్గుణంలో శిఖర సమానుడైన హరీశ్ కి పోయేదేమీ లేదు. నిత్యం ప్రజల మధ్యన ఉంటూ, ప్రజా సమస్యల గురించి గళమెత్తే హరీశ్ గురించి మాట్లాడటం ఆకాశం మీద ఉమ్మేయడమే. కేటీఆర్, హరీశ్ సొంత అన్నదమ్ముల లెక్క ఉంటారు. ఇద్దరి మధ్య వైరుధ్యాలు సృష్టించే పని చేస్తున్నారు.
Also Read: ఎవరిపై మీ సమరం, ప్రజలపై యుద్ధం చేసి బాగుపడినోళ్లు లేరు- ఉద్యోగ సంఘాలపై సీఎం రేవంత్ సీరియస్
వెరిఫైడ్ ట్విట్టర్, ఫైరిఫైడ్ ఫేస్ బుక్ పేజీలతో ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి జేబు సంస్థలు, పెయిడ్ సంస్థలతో ఇలా ప్రచారం చేస్తున్నారు. సైబర్ క్రైమ్ కి పాల్పడితే చర్యలు తీసుకోవాలనే ముఖ్యమంత్రి, ఇలాంటి పనులు చేస్తున్న మీపై ఉక్కుపాదం మోపుతారా? బీఆర్ఎస్ కార్యకర్తలపై చిన్న వాటికే కేసులు పెట్టే డీజీపీ, ఇప్పుడు రేవంత్ రెడ్డిపై, ఆయన పెయిడ్ బ్యాచ్ పై ఎన్ని కేసులు నమోదు చేస్తారు? బీఆర్ఎస్ నాయకులను పోలీసు స్టేషన్లలో గంటల కొద్దీ పెట్టి నరకం చూపిస్తున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.
కాంగ్రెస్ నాయకులకు పోలీసులు తొత్తులుగా వ్యహరిస్తుండటం దారుణం. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. రేవంత్ రెడ్డికి పగటి కలల వ్యాధి వచ్చింది. అందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీటలు వారుతున్నది. ఈ తప్పుడు ప్రచారం వల్ల బీఆర్ఎస్ బీటలు వారవు. హరీశ్, కేటీఆర్ మధ్య దూరం పెరగదు.
ఇలాంటి ప్రచారం వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? పరిపాలన చేయమంటే, ఇలాంటి చిల్లర ప్రచారం ఏమిటి? ఇందు కోసమేనా మార్పు కావాలి, కాంగ్రెస్ కావాలన్నది. రాముడికి హనుమంతుడు ఎట్లనో, కేసీఆర్ కు హరీశ్ అట్ల. కృష్ణార్జున లెక్క హరీశ్, కేటీఆర్ లు.. వారిని విడదీయలేరు” అని తేల్చి చెప్పారు దాసోజు శ్రవణ్.