Formula E Car Race Case : ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసు.. కేటీఆర్ కు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవనున్న ఏసీబీ..!
అన్ని డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాత కేసు నమోదు చేసినట్లు ఏసీబీ చెబుతోంది.

KTR
Formula E Car Race Case : ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో విచారణను వేగవంతం చేసేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేస్తోంది. ఈ సందర్భంగా బంజారాహిల్స్ ఏసీబీ ఆఫీసులో అధికారులతో ఏసీబీ డీజీ విజయ్ కుమార్ సమావేశం అయ్యారు. మాజీ మంత్రి కేటీఆర్ కు నోటీసులు జారీ చేసి విచారణకు పిలవనుంది ఏసీబీ. విదేశీ కంపెనీలకు నిధుల విడుదల నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని ఏసీబీ గుర్తించింది. అన్ని డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాత కేసు నమోదు చేసినట్లు ఏసీబీ చెబుతోంది.
ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేయడంతో.. అడిషనల్ డీజీగా ఉన్న విజయ్ కుమార్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఒకవేళ విచారణకు సహకరించకపోతే న్యాయస్థానాలకు వెళితే ఎలా డిఫెండ్ చేయాలి, అందులో విధివిధానాలు ఏంటి.. అనే అంశంపై ఒక ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశారు. లీగల్ టీమ్, ఎవిడెన్స్ టీమ్, ఐటీ సెల్ టీమ్.. ఇలా అన్ని విభాగాల నుంచి స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేశారు. ఈ టీమ్ కు డైరెక్టర్ తరుణ్ జోషి బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం. తరుణ్ జోషి నేతృత్వంలోనే ఈ టీమ్ పని చేస్తుందని సమాచారం. అడిషనల్ డీజీగా ఉన్న ఏసీబీ డీజీ విజయ్ కుమార్ మానిటరింగ్ చేస్తారు. ఈ టీమ్ లో మొత్తం ఐదుగురు సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ కార్ రేస్ కేసు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో ఎట్టకేలకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏ-1గా చేర్చారు. గత ప్రభుత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేసిన ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ఏ-2గా చేర్చారు. బీఎల్ఎన్ రెడ్డిని ఏ-3గా చేర్చారు.
Also Read : పొలిటికల్ జైత్రయాత్రకు కవిత రెడీ..! పోటీ చేసేది అక్కడి నుంచేనా?