మద్యం తాగలేదన్నా వినలేదు

హైదరాబాద్ : నగరంలో 2018, డిసెంబర్ 31న ఒక విచిత్రమైన ఘటన జరిగింది. సాదారణంగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుంటారు. మద్యం తాగి వాహనాలు నడిపినవారు పట్టుబడతారు. కానీ ఓ వ్యక్తి మద్యం తాగకున్నా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు. మద్యం తాగకున్నా తాగినట్లు బ్రీత్ అనలైజర్ చూపింది. దీంతో బాధితుడు అవాక్కయ్యాడు. నూతన సంవత్సర వేడుకల్లో మద్యం సేవించి వాహనం నడిపినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు వ్యక్తి తాను మద్యం తాగలేదంటూ చెప్పినా పోలీసులు వినలేదు. చివరికి ఆస్పత్రి నుంచి తాను మద్యం తాగలేదని నివేదిక తీసుకొచ్చినా అంగీకరించలేదు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి తాడ్ బంద్ చౌరస్తాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఉప్పల్ కు చెందిన నాగ భూషణ్ (32) తాడ్ బంద్ లోని ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. నెలాఖరు కావడంతో సోమవారం అర్ధరాత్రి వరకు విధులు ముగించుకుని రాత్రి 12 గంటలకు తన బైక్ పై ఇంటికి వెళ్తున్నాడు. మార్గంమధ్యలో తాడ్ బంద్ చౌరస్తా సమీపంలో తిరుమలగిరి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ సోదాలు నిర్వహించారు. పోలీసులు నాగభూషణ్ కు బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయడయంతో భారీగా మద్యం సేవించినట్లు చూపింది. పోలీసులు అతని వాహనాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.
బాధితుడు నాగ భూషణ్ స్వయంగా అప్పటికప్పుడు గాంధీ ఆస్పత్రికి వెళ్లి ఒంటి గంట సమయంలో పరీక్షలు చేయించుకుంటే అక్కడి వైద్యులు అతడికి క్లీన్ చిట్ ఇస్తూ ఎమ్మెల్సీ నివేదికను ఇచ్చారు. మంగళవారం ఆ నివేదికతో వెళ్లినా పోలీసులు తన వాహనాన్ని ఇవ్వడానికి అంగీకరించలేదని బాధితుడు ఆరోపించారు. ఈ విషయమై తిరుమలగిరి ట్రాఫిక్ శన్ స్పెక్టర్ రవిని వివరణ కోరగా బ్రీత్ అనలైజర్ పరీక్షలో అతడు మద్య సేవించినట్లు నిర్ధారణ అయిందని, ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.