జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈసీ సమావేశం : ఓటరు జాబితాపై టీఆర్ఎస్ మినహా రాజకీయ పార్టీల అభ్యంతరం

GHMC Elections : జీహెచ్ఎంసీ ఎన్నికల తీరుపై రాజకీయ పార్టీలు అభ్యంతరం తెలిపాయి. ఓటర్ జాబితాపై టీఆర్ఎస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. గురువారం (నవంబర్ 12, 2020) జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఈసీతో జరిగిన వివిధ రాజకీయ పార్టీల సమావేశం ముగిసింది. రాజకీయ పార్టీలతో ఈసీ వేర్వేరుగా సమావేశం అయింది.
ఓటరు జాబితాపై ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. తమ అభ్యంతరాలు పరిష్కరించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలని కోరాయి. హడావిడిగా ఎన్నికలు నిర్వహించడం ఎందుకని ఈసీని రాజకీయ పార్టీలు ప్రశ్నించాయి. కాగా రేపు జీహెచ్ఎంసీ ఓటర్ల తుది జాబితా విడుదల కానుంది. నవంబర్ 15న షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.
62 డివిజన్లలో హిందువుల ఓట్లు గల్లంతయ్యాయని బీజేపీ ఈసీకి ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం అమలు చేస్తున్న రిజర్వేషన్ల వల్ల బీసీలకు తీవ్ర నష్ట కలిగే అవకాశం ఉందని కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. గతంలో తొలగించిన 10 లక్షల ఓటర్ల పేర్లను తిరిగి చేర్చాలని సీపీఎం డిమాండ్ చేసింది.
ఎస్టీ రిజర్వేషన్లపై సీపీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒక డివిజన్ ఓట్లు మరో డివిజన్ లో వచ్చాయని టీడీపీ ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. సోషల్ మీడియాను కట్టడి చేయాలని టీఆర్ఎస్ తెలిపింది.