Telangana Elections 2023: ఈ నెల 26న మరో డిక్లరేషన్.. మేనిఫెస్టో విడుదల కోసం సోనియాను ఆహ్వానిద్దామన్న రేవంత్
ఇంతకు ముందు నిర్వహించిన ఖమ్మం సభలాగే ఇప్పుడు చేవెళ్ల సభను విజయవంతం చేయాలని చెప్పారు.

Revanth Reddy
Telangana Assembly Elections 2023 – Revanth Reddy : తెలంగాణ (Telangana) కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఈ నెల 26న సాయంత్రం 4 గంటలకు చేవెళ్లలో ప్రజా గర్జనసభ నిర్వహిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. సభకు ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హాజరవుతారని తెలిపారు.
ఇందులో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ను ఖర్గే విడుదల చేస్తారని వివరించారు. ఈ సభను నిర్వహించనున్న వేళ ఈ నెల 21 నుంచి 25 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ శ్రేణులు సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఇంతకు ముందు నిర్వహించిన ఖమ్మం సభలాగే చేవెళ్ల సభను విజయవంతం చేయాలని చెప్పారు.
కాంగ్రెస్ ప్రకటించే మహిళా డిక్లరేషన్ సభకు ప్రియాంక గాంధీని ఆహ్వానిద్దామని అన్నారు. మేనిఫెస్టో విడుదలకు సోనియా గాంధీని ఆహ్వానిద్దామని తెలిపారు. కాంగ్రెస్ నిర్వహిస్తున్న తిరగబడదాం.. తరిమికొడదాం కార్యక్రమాన్ని తెలంగాణలోని ప్రతి గ్రామంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.
అందుకు పార్లమెంట్ వారీగా కోఆర్డినెటర్లను నియమించామని చెప్పారు. 29న మైనారిటీ డిక్లరేషన్ ను వరంగల్ లో విడుదల చేయాలని భావిస్తున్నామని తెలిపారు. అలాగే, ఓబీసీ, మహిళా డిక్లరేషన్ల కోసం సబ్ కమిటీని నియమిస్తామని చెప్పారు. నెల రోజుల పాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. కాగా, ఇవాళ పీసీసీ కార్యవర్గం అత్యవసర సమావేశంలో చేవెళ్ల ఖర్గే సభ, గద్వాల్ సభపై చర్చించారు.