Bandi Sanjay: కేంద్రమంత్రి బండి సంజయ్‌కు సిట్ నోటీసులు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలన్న అధికారులు..
సిట్ నోటీసులకు బండి సంజయ్ స్పందించారు.

Bandi Sanjay: తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసుకి సంబంధించి పలువురికి నోటీసులు ఇచ్చి విచారించారు సిట్ అధికారులు. తాజాగా కేంద్రమంత్రి బండి సంజయ్ కి సిట్ నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. సిట్ నోటీసులకు బండి సంజయ్ స్పందించారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్న సమయంలో సిట్ విచారణకు రాలేనని బండి సంజయ్ తెలిపారు. తాను 28న విచారణకు హాజరవుతానని సిట్ అధికారులకు తెలియజేశారు కేంద్రమంత్రి బండి సంజయ్.
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ పేరుతో సిట్ అధికారులు వేధిస్తున్నారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తరచూ పోలీస్ స్టేషన్ కు పిలిచి ఇబ్బంది పెడుతున్నారంటూ పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రభాకర్ రావు పిటిషన్ పై ఆగస్టు 4న విచారణ జరగనుంది.
ఫోన్ ట్యాపింగ్ కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారమే రేపింది. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురు పోలీస్ అధికారులను అరెస్ట్ చేశారు. కొంతమందిని విచారిస్తున్నారు. కొందరు సాక్షులను కూడా విచారించారు. వారందరి స్టేట్ మెంట్లను నమోదు చేసుకున్నారు. ఎస్ఐబీ చీఫ్ గా పని చేసిన ప్రభాకర్ రావుని సిట్ అధికారులు ఇప్పటివరకు ఆరుసార్లు విచారించారు. అయితే విచారణ పేరుతో తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ పేరుతో పిలిచి గంటలు గంటలు కూర్చోపెట్టి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విచారణను పూర్తిగా తొలగించే విధంగా కోర్టు ఆదేశాలు ఇవ్వాలంటూ ప్రభాకర్ రావు పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. ఆ పిటిషన్ పై సిట్ అధికారులు సైతం కౌంటర్ దాఖలు చేశారు.