Left parties: పొత్తులపై కామ్రేడ్లు కన్ఫ్యూజన్ లో పడిపోయారా.. ఎందుకీ పరిస్థితి?

షెడ్యూల్ వెలువడ్డా పొత్తులపై ఇంకా క్లారిటీ లేక కామ్రేడ్లు కన్ఫ్యూజన్ లో పడిపోయారా? రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన వామపక్షాలకు ఎందుకీ పరిస్థితి?

Left parties: పొత్తులపై కామ్రేడ్లు కన్ఫ్యూజన్ లో పడిపోయారా.. ఎందుకీ పరిస్థితి?

Telangana Assembly Elections 2023 Left parties look up to Congress for alliance

Telangana Assembly Elections 2023: తెలంగాణాలో కామ్రేడ్ల పాలిటిక్స్ కు కాలం కలిసి రావడం లేదా..? కమ్యూనిస్టు రాజకీయాల్లో వరుస ట్విస్టులేంటి? మొన్నటి దాకా అధికార బీఆర్ఎస్, ఇప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్ కామ్రేడ్ లను లైట్ తీసుకోవడానికి కారణమేంటి? స్నేహం చేద్దామని పిలుస్తూ… ఊరిస్తూ ఉసూరు మనిస్తుండటాన్ని ఏమనుకోవాలి? మనుగోడు ఎన్నికల్లో మద్దతు తీసుకున్న అధికార బీఆర్ఎస్ కారులో ఖాళీ లేదంటూ డోర్స్ క్లోజ్ చేస్తే.. స్నేహ హస్తం చాచిన కాంగ్రెస్ రెండు నెలలుగా ఏదీ తేల్చకుండా నాన్చుతుండటాన్ని ఎలా చూడాలి ? షెడ్యూల్ వెలువడ్డా పొత్తులపై ఇంకా క్లారిటీ లేక కామ్రేడ్లు కన్ఫ్యూజన్ లో పడిపోయారా? రాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన వామపక్షాలకు ఎందుకీ పరిస్థితి? తెరవెనుక రాజకీయమేంటో చూద్దాం.

తెలంగాణలో కమ్యూనిస్టులకు కాలం కలిసిరావట్లేదనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా అధికార బీఆర్ఎస్‌తో మైత్రి పెట్టుకున్న కామ్రేడ్లు.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ కారు పార్టీతో పొత్తులపై ఊహాల్లో షికారు చేశారు. కాని కమ్యూనిస్టులకు ఊహించని షాక్ ఇచ్చారు సీఎం కేసీఆర్. అసెంబ్లీ టికెట్లకు గులాబీ పార్టీలోనే విపరీతంగా పోటీ ఉండటంతో కమ్యూనిస్టులకు సర్దుబాటు చేయలేమని భావించి పొత్తు రాజకీయాన్ని ఆదిలోనే తుంచేశారు. మునుగోడు విజయంలో కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టులను ప్రగతిభవన్‌కు పిలిపించి అన్నివిధాల గౌరవించిన సీఎం కేసీఆర్.. ఆ తర్వాత వామపక్ష నేతలకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్ ఎంత నిర్లక్ష్యం చేసినా.. ఆ పార్టీ మద్దతు ఉంటే అసెంబ్లీలో అడుగుపెట్టడం ఈజీ అవుతుందని భావించిన కామ్రేడ్లు.. చివరిదాకా బీఆర్ఎస్ తో పొత్తుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ తన మాటే ఫైనల్.. పొత్తులకు చాన్సే లేదంటూ మునుగోడు పొత్తుకు తూచ్ చెప్పేశారు సీఎం కేసీఆర్.

అధికార పార్టీ నుంచి తీవ్ర పరాభవం ఎదురైన కామ్రేడ్లు.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీతో చెట్టాపట్టాలు వేయడానికి రెడీ అయ్యారు. బీఆర్ఎస్ కన్నా ముందుగానే కాంగ్రెస్ స్నేహహస్తం ఇచ్చినా.. అప్పటి పరిస్థితుల్లో తొలి ఓటు గులాబీ పార్టీకే వేసిన కమ్యూనిస్టు లీడర్లు.. గులాబీ బాస్ ఇచ్చిన షాక్‌తో గత్యంతరం లేని పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను ఆశ్రయించారు. ఐతే కర్ణాటక విజయం తర్వాత అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్ కూడా కమ్యూనిస్టులను లైట్ గా తీసుకోవడంతో పొత్తు కోసం కాంగ్రెస్‌ను బతిమిలాడుకునే పరిస్థితికి చేరుకున్నారు వామపక్ష లీడర్లు. రాష్ట్రస్థాయిలో పలుసార్లు పీసీసీ నేతలతో చర్చించినా పొత్తులు ఇంతవరకు ఫైనల్ కాలేదు. ఇప్పుడు షెడ్యూల్ విడుదల కావడంతో పొత్తులు ఉంటాయో, లేవో? అన్న పరిస్థితికి వచ్చింది. సొంతంగా పోటీ చేయాలనే ఆలోచన వదిలేసిన కమ్యూనిస్టు నాయకులు ఇన్నాళ్లు పొత్తుల కోసం పార్టీల చుట్టూ తిరగడం వల్ల క్షేత్రస్థాయిలో మరింత బలహీనమయ్యామని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు.

అటు బీఆర్ఎస్.. ఇటు కాంగ్రెస్.. ఒకేలా కామ్రేడ్లతో బంతాట ఆడటానికి కారణాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. కార్మిక ఉద్యమాలతో క్షేత్రస్థాయిలో బలంగా ఉండే వామపక్ష పార్టీలు కొన్నేళ్లుగా.. ముఖ్యంగా తెలంగాణ ఆవిర్భావం తర్వాత పోరాట పంథా వదిలేయడంతో క్రమంగా బలహీనమయ్యయి. ఒకప్పుడు ఖమ్మం, నల్లగొండ జిల్లాల నుంచి ఏడెనిమిది మంది వామపక్ష పార్టీల ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అసెంబ్లీలో సీపీఐ, సీపీఎం పార్టీలు రెండింటికీ ప్రాతినిధ్యం లేకపోవడంతో నానాటికి తీసికట్టులా మారింది కామ్రేడ్ల పరిస్థితి. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాలతోపాటు కరీంగనగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కమ్యూనిస్టులకు అంతో ఇంతో బలం ఉన్నా.. సొంతంగా గెలిచే సత్తా లేదని పసిగట్టిన బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కమ్యూనిస్టులను లైట్ గా తీసుకుంటున్నాయి.

Also Read: కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల ఎంట్రీకి అడ్డుపడిందెవరు.. తెరవెనుక ఏం జరిగింది?

ఈ కారణంగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏకపక్షంగా.. ఎటువంటి చర్చలకు తావులేకుండా కమ్యూనిస్టులకు కటీఫ్ చెప్పేశారు. పైగా రెండు పార్టీలు చెరో నాలుగేసి స్థానాలు అడుగుతుండటం.. బీఆర్ఎస్ భారంగా భావించింది. ఇక కాంగ్రెస్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటుండటంతో కమ్యూనిస్టులతో మైత్రిపై ఎటూ తేల్చడం లేదు. చెరో నాలుగు సీట్లు ఇచ్చే కన్నా.. రెండింటికి కలిపి నాలుగు స్థానాలు ఇస్తామని తాజాగా ప్రతిపాదిస్తోంది. అదిగాక.. తాము బలంగా ఉన్నామని భావిస్తున్న ఖమ్మం, నల్గొండల్లోనే కామ్రేడ్లకు టిక్కెట్లు కేటాయించాల్సి రావడం కూడా కాంగ్రెస్కు ఇబ్బందిగా మారింది. చివరకు తీసుకుంటే చెరో రెండు తీసుకోండి.. లేదంటే తమ అభ్యర్థులు పోటీకి రెడీ అవుతారంటూ కామ్రేడ్స్‌కు తేల్చేచెబుతోంది కాంగ్రెస్.

Also Read: ఆ ఇద్దరు నేతలు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడానికి కారణం అదేనా?

ఈ పరిస్థితుల్లో వామపక్షాల భవిష్యత్ రాజకీయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రధాన పార్టీలు కమ్యూనిస్టులతో కబడ్డీ ఆడుకుంటుండటం చూస్తున్న పరిశీలకులు గతంలో ఎప్పుడూ ఇలాంటి స్థితిని చూడలేదని అంటున్నారు. సంప్రదాయ పార్టీలు వద్దంటున్నా.. కమ్యూనిస్టులు పొత్తు కోసం వెంపర్లాడటంపై రకరకాల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి కామ్రేడ్లతో పొత్తుకు కాంగ్రెస్ సై అంటుందా.. చెరో రెండు సీట్లతో కామ్రేడ్స్ సర్దుకుంటారా చూడాలి. మరోవైపు షెడ్యూల్ విడుదలైనా.. నామినేషన్ల చివరి తేదీ వరకు వేచిచూసే ధోరణినే ప్రదర్శిస్తున్నారు కమ్యూనిస్టు బడా లీడర్లు. పొత్తుల ఇంకా సమయం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి వ్యాఖ్యానించడం చూస్తే కమ్యూనిస్టుల పొత్తు ఆశలు ఇంకా సజీవంగా ఉన్నట్లు భావిస్తున్నారు పరిశీలకులు.