Rythu bharosa: రైతు భరోసా డబ్బులు వచ్చేశాయ్.. అకౌంట్లు చెక్ చేసుకోండి..
రైతు భరోసా పథకం కింద ఇప్పటి వరకు 44.82లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,487.82 కోట్ల నిధులు ప్రభుత్వం జమ చేసింది.

Rythu bharosa
Rythu Bharosa: ‘రైతు భరోసా’ పథకం కింద పంట సాగుదారులకు ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందజేస్తున్న విషయం తెలిసిందే. ఎకరాకు ఏడాదికి రెండు విడతల్లో రూ.12వేలను ప్రభుత్వం రైతు అకౌంట్లలో జమ చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో మొదటి విడత ఎకరాకు రూ.6వేలు అందజేస్తుంది. ఇప్పటికే మూడు విడుతల్లో నిధులు జమ చేసిన ప్రభుత్వం.. రెండు ఎకరాలలోపు రైతులకు లబ్ధిచేకూర్చింది. తాజాగా నాల్గో విడతలో మూడెకరాల భూమి కలిగిన రైతుల అకౌంట్లలో రూ.1,230.98 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. దీంతో ఇప్పటి వరకు రైతు భరోసా పథకం కింద 44.82లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.3,487.82 కోట్ల నిధులు జమ అయ్యాయి.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘రైతు భరోసా’ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. పైలెట్ ప్రాజెక్టు కింద ప్రతి మండలంలో ఒక గ్రామానికి చొప్పున 577 గ్రామ పంచాయతీలకు చెందిన 4,41,911 మంది రైతుల ఖాతాల్లో రూ.568.99 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఆ తరువాత ఫిబ్రవరి 5న రాష్ట్రంలోని ఎకరం భూమి కలిగిన 17.03లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.557.54కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ఈనెల 10న రెండు ఎకరాల భూమి కలిగిన 13.23లక్షల మందికి రైతుల ఖాతాల్లో 1091.95 కోట్లను చేసింది. అదేవిధంగా ఫిబ్రవరి 12న రెండెకరాల భూమి కలిగిన 56,898 రైతుల ఖాతాల్లో 383.401 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. తాజాగా.. మూడెకరాల వరకు భూమి కలిగిన 9,56,422 మంది రైతుల ఖాతాల్లో 1230.08 కోట్లను ప్రభుత్వం జమ చేసింది.
రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం ఇప్పటి వరకు 44,82,265 మంది రైతుల ఖాతాల్లో 58,13,036 ఎకరాలకుగాను రూ.3,487.82 కోట్ల నిధులను జమ చేసింది. మిగతా వారికి త్వరలో నిధులు విడుదల చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. అయితే, రైతు భరోసా పథకం కింద అర్హత కలిగిన రైతులకు మార్చి 31 వరకు నిధులు జమ చేస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
మీ అకౌంట్లోకి డబ్బులు రాలేదా..? ఇలా చేయండి..
తెలంగాణ ప్రభుత్వం సాగుయోగ్యమైన భూమికి రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తున్న విషయం తెలిసిందే. దశల వారిగా ఎకరం, రెండు ఎకరాలు, మూడు ఎకరాలు.. ఇలా.. అర్హత కలిగిన అందరి రైతు ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. ఇందుకోసం ఈ-కుబేర్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో ‘రైతు భరోసా’ డబ్బులు జమ కాకపోతే ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీ భూమి వివరాలు, సాగు చేస్తున్న పంట, పట్టాదారు పాసు పుస్తకాలు వంటి వివరాలతో వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలి. అక్కడ అంతా కరెక్టుగా ఉంటే తరువాత బ్యాంక్ వద్దకు వెళ్లి మీ అకౌంట్ వివరాలు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్, IFSC కోడ్ సరిగా ఇచ్చారో లేదో చూసుకోవాలి. బ్యాంక్ ఖాతా యాక్టివ్ గా ఉందో లేదో చూసుకోవాలి. ఏవైనా సమస్యలు ఉంటే సరిచేసుకొని సంబంధిత పత్రాలను కస్టర్ వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈఓ)కి ఇవ్వాల్సి ఉంటుంది.