ఏం జరుగుతోంది ? ములుగు ఏజెన్సీ ప్రాంతంలో డీజీపీ మహేందర్ రెడ్డి

telangana state dgp : ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో హై టెన్షన్ నెలకొంది. ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యటిస్తున్నారు. వాజేడు – వెంకటాపురం సీఆర్పీఎఫ్ క్యాంప్‌లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పోలీస్ ఉన్నతాధికారుల సమావేశం జరుగనుంది. దీంతో ఏజెన్సీలో మరోసారి ఏం జరుగుతుందోనన్న అలజడి చెలరేగింది. వెంకటాపురంలో మూడు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు.. CRPF అధికారులు భేటీ కానున్నారు.
ఈ సమావేశంలో డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు.. సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారి మహేందర్, ఐజీ నాగిరెడ్డి, వరంగల్, కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్‌కుమార్ పాల్గొంటున్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ పోలీసు అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. మావోయిస్టుల ఏరివేతపైనే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశముంది.
మావోయిస్టుల ఏరివేతకు వ్యూహం రూపొందించనున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులను సీఆర్పీఎఫ్ సెంట్రల్ డీజీ విజయ్‌కుమార్ పరిశీలించనున్నారు. గతంలో ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్‌ను విజయ్‌కుమార్ మట్టుబెట్టారు. ఆయన మొదటి సారి తెలంగాణలో పర్యటిస్తున్నారు.
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు భారీ సంఖ్యలో తరలివచ్చినట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో CRPF బలగాలు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే వెంకటాపురంలో పోలీసులు ఉన్నతాధికారుల సమావేశం ఏర్పాటు చేశారు. రెండు నెలల కాలంలో డీజీపీ మహేందర్‌రెడ్డి రెండోసారి ఏజెన్సీలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.