యూకే టు తెలంగాణ : మరో ఇద్దరికి కరోనా, 154 మంది ఎక్కడ ?

UK to Telangana : తెలంగాణ రాష్ట్రంలో కొత్త కరోనా స్ట్రైయిన్ భయాన్ని సృష్టిస్తోంది. ఎందుకంటే యూకే దేశం నుంచి తెలంగాణ రాష్ట్రానికి వస్తున్న వారిలో కరోనా ఉందని తేలుతుండంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. మరో ఇద్దరికీ కరోనా పాజిటివ్ ఉందని తేలింది. మల్కాజ్ గిరికి చెందిన వారిగా నిర్ధారించారు. ఇప్పటి వరకు మొత్తం 20 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను సీసీఎంబీకి పంపామని, ఫలితాల కోసం వేచి చూస్తున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
కొత్త స్ట్రెయిన్ దృష్ట్యా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు, యూకే నుంచి 1,216 మంది వచ్చారని తెలిపారు. వీరిలో 970 మందిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు, ఇంకా 154 మందిని ట్రేస్ చేయాల్సి ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. యూకే వెళ్లొచ్చిన వారి ఆచూకీ కోసం అధికారులు ఆరా తీస్తున్నారు. కరీనంగర్, ఆదిలాబాద్ జిల్లాల వాసులు వచ్చినట్లు సమాచారం. డిసెంబర్ 09వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పలువురు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
డిసెంబర్ 25వ తేదీ శుక్రవారం 16 మంది కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా వచ్చిన వారిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. జీనోమ్ సీక్వెన్స్ తెలుసుకోవడానికి సీసీఎంబీకి పంపించామని, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించారాయన. రాష్ట్రానికి నేరుగా బ్రిటన్ నుంచి వచ్చిన వారు లేదా బ్రిటన్ మీదుగా ప్రయాణించిన వారు దయచేసి వారి వివరాలను (040-24651119, 9154170960)కి వాట్సాప్ ద్వారా తెలియచేయాలని సూచించారు.