‘నన్నేలు నా స్వామి ‘ ఆవిష్కరించిన అమిత్ షా

‘నన్నేలు నా స్వామి ‘ ఆవిష్కరించిన అమిత్ షా

Updated On : March 11, 2020 / 3:34 PM IST

‘ఆరాధన’ పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్  మరొక సారి పవిత్ర సంచలనానికి తెర లేపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం ఉదయం అద్భుతమైన , అనిర్వచనీయ ఒక అఖండ మహా గ్రంథాన్ని ఆవిష్కరించారు. 

ప్రముఖ చలన చిత్రనిర్మాణ సంస్థ వారాహి చలన చిత్రం సంస్థ అధినేత సాయి కొర్రపాటి సమర్పణలో పురాణపండ శ్రీనివాస్ పుస్తకాన్ని రచించారు. ఒక్కొక్క అక్షరాన్ని శక్తి క్షేత్రంగా మలచి, భౌతికాతీతమైన అపురూప ఆంజనేయ స్వామి మహా మంత్ర వాగ్మయంతో, వ్యాఖ్యానాలతో సంకలనం చేశారు. ‘ నన్నేలు నా స్వామి’ పేరుతో  దేశంలోనే మొదటి అఖండ గ్రంథంగా సంచలనం సృష్టించారు. 

న్యూఢిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో బుధవారం ఉదయం ‘ నన్నేలు నాస్వామి’  మహా గ్రంథావిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా అమిత్ షా  పుస్తకాన్ని ప్రశంసలు కురిపించారు. 

‘నాకు తెలుగు రాకపోయినా ఈ మహా గ్రంథాన్ని పేజీలు తిప్పుతుంటే ఏదో శక్తి ఆవహిస్తున్నట్లుందని, హనుమ భక్తులకు ఆత్మ శక్తిని ఇచ్ఛే మహా విజయాల సాధనా గ్రంథాన్ని ఆంజనేయ స్వామి కటాక్షం వల్లనే పురాణపండ శ్రీనివాస్ ఇంతటి తేజస్సుతో  అందించగలిగారని అభినందించారు.

వారాహి చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి పర్యవేక్షణలో తొలిప్రతిని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డికి అందజేశారు. ఈ గ్రంథ రచనా సంకలన కర్త పురాణపండ శ్రీనివాస్ నిర్మాణాత్మక సామర్థ్యం, అసాధారణ ప్రతిభ, అద్భుత రచనా శైలి, విరామమెరుగక చేసే కృషి, నిస్వార్ధ సేవ ఎంతో ఆకట్టుకున్నాయని అన్నారు. 

తానే ఆంజనేయస్వామిపై ఒక మహా గ్రంథాన్ని అందించమని  కోరడంతో శ్రీనివాస్ ఈ అద్భుతాన్ని అందించారన్నారు. అమిత్ షా వంటి వ్యక్తి ఈ గ్రంథాన్నిఆవిష్కరించడం తనను అనుభూతికి లోను చేసిందని, ఈ కార్యంలో సహకరించిన కిషన్ రెడ్డికి , పురాణపండ శ్రీనివాస్‌కి సాయి కొర్రపాటి కృతజ్ఞతలు తెలియజేశారు. 

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమారుడు హర్షవర్ధన్ , మరొక కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. దశాబ్ద కాలంగా పురాణపండ శ్రీనివాస్ అందమైన శైలితో పాటు, అద్భుతమైన వక్తగా విశేషఖ్యాతి పొందారు.