జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులపై యువకుడు దాడి : బైక్ సైలెన్సర్ తీసేసి మితిమీరిన శబ్దంతో బైక్ నడుపుతూ రచ్చ

జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులపై యువకుడు దాడి : బైక్ సైలెన్సర్ తీసేసి మితిమీరిన శబ్దంతో బైక్ నడుపుతూ రచ్చ

Updated On : February 26, 2021 / 12:07 PM IST

Young man attacks traffic police : హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. హద్దుదాటి ఎక్స్‌ట్రాలు చేశాడు. ఓ రేంజ్‌లో బిల్డప్‌ ఇచ్చాడు. బైక్ సైలెన్సర్ తీసేసి మితిమీరిన శబ్దంతో నడుపుతున్న యువకుడిని ట్రాఫిక్ పోలీసులు నిలదీశారు. అంతే ఆ యువకుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సినిమాలో విలన్‌లా ప్రవర్తించాడు. పోలీసులపై ఎదురుదాడికి దిగాడు. ట్రాఫిక్ సీఐతో పాటు సిబ్బందిపైనా దాడికి పాల్పడ్డాడు. హోంగార్డుపై పిడిగుద్దులు కురిపించాడు.

జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌లో మితిమీరిన శబ్దంతో బైక్ నడుపుతూ ఓ యువకుడు రచ్చ చేశాడు. బైక్‌ సైలెన్సర్ తీసేసి హెవీ సౌండ్‌తో రోడ్డుపై చక్కర్లు కొట్టాడు. చెవికి చిల్లులు పడే శబ్దంతో వీరంగం సృష్టించాడు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ సీఐ ఆ బైక్‌ను ఆపాల్సిందిగా హోంగార్డు రాథోడ్‌కు సూచించారు. ఆయన వాహనాన్ని నిలిపేందుకు ప్రయత్నించగా ఆ యువకుడు రెచ్చిపోయాడు. ఏకంగా హోంగార్డుపై దాడి చేశాడు.

హోంగార్డుపై దాడి చేస్తుండగా.. నిలదీసేందుకు సీఐ వెళ్లారు. ఆయన్ని కూడా ఈ యువకుడు నెట్టేసి దాడికి పాల్పడ్డాడు. పోలీసు సిబ్బందితో పాటు ఇతర వాహనదారులు ఎంత చెప్పినా అతడు వినిపించుకోకుండా స్నేహితులతో కలిసి నానా హంగామా సృష్టించాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. యువకుడితో పాటు అతడి స్నేహితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.