యాంకర్ కు చిక్కిన బోటు : వెలికితీత పనుల్లో పురోగతి

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చలూరు వద్ద గోదావరి నదిలో జరుగుతున్న ఆపరేషన్ రాయల్ వశిష్టలో పురోగతి కనిపించింది. బోటు వెలికితీత పనుల్లో భాగంగా ధర్మాడి టీమ్ బుధవారం గోదావరిలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో యాంకర్‌కు బలమైన వస్తువు చిక్కింది. అది బోటేనని ధర్మాడి టీమ్ విశ్వసిస్తోంది. యాంకర్ కు చిక్కుకున్న బలమైన వస్తువు చుట్టూ ధర్మాడి బృందం ఉచ్చు వేస్తోంది. ప్రొక్లెయిన్ సాయంతో దానిని బయటకు లాగనున్నారు. పూర్తిస్థాయిలో రోప్ బయటకు లాగిన తర్వాత లంగరుకు తగిలింది బోటా లేక బండరాయా అన్నది తెలుస్తుంది.
బోటును వెలికి తీసేందుకు ధర్మాడి టీమ్ సంప్రదాయ పద్ధతులను అనుసరిస్తోంది. ముందుగా 15 వందల మీటర్ల పొడవైన ఇనుప రోప్‌ను బలమైన వస్తువు చుట్టూ వేస్తున్నారు. ఉచ్చులో అది చిక్కుకున్నాక ప్రొక్లెయిన్ సాయంతో దాన్ని బయటకు లాగుతారు. భారీ యాంకర్లు, బలమైన రోపులను ధర్మాడి బృందం ఉపయోగిస్తోంది.
ఆపరేషన్-1లో వాడిన యాంకర్ విరిగి, రోప్ తెగిపోయింది. దీంతో ఈసారి అంతకంటే బలమైన సామాగ్రిని ధర్మాడి టీమ్ వాడుతున్నారు. బోటుకు ఉచ్చు వేయడానికి 1.25 అంగుళం మందం, 1500 మీటర్ల పొడవైన ఇనుప రోప్‌ను ఉపయోగిస్తున్నారు. గోదావరి నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో బోటు బయటకు వస్తుందని ధర్మాడి బృందం ఆశలు పెట్టుకుంది. మరోవైపు ఆపరేషన్ రాయల్ వశిష్ట-2తో గల్లంతైన వారి బంధువుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. మృతదేహాలు కాకపోయినా వారికి సంబంధించిన వస్తువులు దొరికినా చాలు అని ఆశగా ఎదురుచూస్తున్నారు.