జాతీయ నేతలు రాక : విశాఖ గడ్డపై టీడీపీ సింహగర్జన

  • Published By: vamsi ,Published On : March 25, 2019 / 05:21 AM IST
జాతీయ నేతలు రాక : విశాఖ గడ్డపై టీడీపీ సింహగర్జన

Updated On : March 25, 2019 / 5:21 AM IST

దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచార హీట్ పెరిగిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మార్చి 31వ తేదీన విశాఖలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీకి మద్దతు తెలిపేందుకు మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ వంటి ప్రముఖ జాతీయ నేతలు హాజరుకానున్నారు. ఉత్తరాంధ్రతోపాటు రాష్ట్రంలోనే అతిపెద్ద నగరమైన విశాఖపట్నంలో మోడీ విధానాలను ఎండగట్టేందుకు దేశవ్యాప్తంగా నేతలు నడుం బిగించారు.

ఈ క్రమంలో విశాఖ వేదికగా దేశానికి సందేశం ఇచ్చేందుకు నేతలు రానున్నారు. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పోటీ విశాఖలో నెలకొన్న నేపథ్యంలో ఈ సభకు ప్రాధాన్యత ఏర్పడింది. విభజన చట్టం, ఇతర హామీల అమలు కోసం కేంద్రంపై పోరాటం పేరుతో గతంలో ఢిల్లీలో చంద్రబాబు సభ నిర్వహించగా ఆ సభకు మమతా బెనర్జీ హాజరు కాలేకపోయింది. ఈ క్రమంలో తెలుగుదేశం నిర్వహిస్తున్న సభలో ఆమె పాల్గొనబోతుంది.

విశాఖపట్నం లోక్‌సభకి టీడీపీ నుంచి మాజీ ఎంపీ ఎం.వి.వి.ఎస్‌.మూర్తి మనమడు శ్రీభరత్‌, వైసీపీ తరఫున సత్యనారాయణ, జనసేన నుంచి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, భాజపా నుంచి కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి పోటీ చేస్తుండడంతో విశాఖ పార్టమెంటు నియోజకవర్గంలో చతుర్మఖ పోటీ నెలకొంది. అయితే ఉత్తరాంధ్రలో పోలింగ్‌కు ముందు బల ప్రదర్శన చేయాలనే ఉద్దేశంతో టీడీపీ ఈ భహిరంగ సభను నిర్వహిస్తుంది.