కొల్లేరుకి కొంగలు వచ్చినట్లుగా.. పులివెందుల పంచాయితీలు అక్కడే: పవన్ కళ్యాణ్

  • Published By: vamsi ,Published On : December 18, 2019 / 01:49 AM IST
కొల్లేరుకి కొంగలు వచ్చినట్లుగా.. పులివెందుల పంచాయితీలు అక్కడే: పవన్ కళ్యాణ్

Updated On : December 18, 2019 / 1:49 AM IST

మూడు రాజధానుల ప్రకటనపై ట్విటర్ వేదికగా జగన్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. ఒక రాజధానికే దిక్కులేదంటూ విమర్శలు గుప్పించిన పవన్.. హై కోర్ట్ కర్నూల్‌లో ఉంటే శ్రీకాకుళం నుండి కర్నూల్‌కి వెళ్లాలా? అనంతపురం నుండి ఉద్యోగులు విశాఖపట్నం వెళ్లి ఉద్యోగాలు చేయాలా? సామాన్య ప్రజలకు ఏదైనా కోర్టు, లేదా సెక్రటేరియట్‌లో పని ఉంటే వెళ్ళటం సాధ్యమయ్యే పనేనా ? అని ప్రశ్నించారు.

సీజన్‌లో, కొల్లేరుకి కొంగలు వచ్చినట్లుగా ఏడాదికి మూడు సార్లు ఎమ్మెలేలు లెజిస్లేటివ్ రాజధానికి వెళ్ళాలా? అని ప్రశ్నించారు. మూడు సీజన్లలో అమరావతికి వచ్చి సభ నడిపి తరవాత తాళాలు వేసుకుని వెళ్లాలనేది జగన్ రెడ్డి ఆలోచనలా ఉందన్నారు.

అమరావతిలో పరిపాలన ఇంకా పూర్తిగా కుదురుకోలేదు. వేల మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు ఇప్పుడిప్పుడే రాజధాని ప్రాంతానికి అలవాటు పడుతున్నారు. వారి పిల్లల్లు కూడా రాజధాని ప్రాంతంలో విద్యాలయాల్లో చేరారు. వాళ్లని మళ్ళీ ఎగ్జిక్యూటివ్ రాజధాని అని మరోచోటికి వెళ్లిపోమంటే ఎలా? అని నిలదీశారు.

రాజధాని మార్పు అంటే ఆఫీసు ఒక చోటు నుంచి మరో చోటుకు మార్చడం కాదని, కొన్ని వేల జీవితాలను బలవంతంగా తరలించడమేనని అన్నారు. వారికయ్యే వ్యయప్రయాసలకి బాధ్యత ఎవరు తీసుకుంటారు అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటన ఒక వ్యూహం ప్రకారమే చేశారు. నేను పోరాట యాత్రలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర భూములు చాలావరకు వైసీపీ నాయకులు చేతుల్లోకి వెళ్లిపోయాయని స్థానికులు చెప్పారు.

విశాఖ ప్రాంతంలో భూములను ముందుగానే హస్తగతం చేసుకొంటూ వచ్చారు. అలాగే వివాదాస్పద భూముల పంచాయితీలు మొదలుపెట్టారు. విలువైన భూముల రికార్డులు లేవు. వాటిపై కఠినంగా ఉన్న జాయింట్ కలెక్టర్ శ్రీ శివశంకర్‌ని తప్పించి తమకు అనుకూలమైన వేణు గోపాల్ రెడ్డిని నియమించారు. ఈ హడావుడి అంతా వారం క్రితమే జరిగింది. దీనిని ఐఏఎస్‌లు కూడా తప్పుబట్టారు. అయినా జగన్ పట్టించుకోలేదు. ఇక అక్కడ కూడా పులివెందుల  పంచాయితీలు మొదలవుతాయి. అని పవన్ కళ్యాణ్ అన్నారు.