భోజనాలు చేయడం కోసం లైఫ్ జాకెట్ల తొలగింపు : పెరిగిన మృతుల సంఖ్య

తూర్పుగోదావరి జిల్లాలో విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదిలో పర్యాటక బోటు ప్రమాదం జరిగింది. ఈఘటనలో 12 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. దాదాపు 40 మంది గల్లంతైనట్లు నిర్ధారించారు. బోటులో మొత్తం 71 మంది ఉన్నట్లు తెలుస్తోంది. పర్యాటకులు 61, బోటు సిబ్బంది 10 ఉన్నారు. అయితే భోజనాలు చేయడం కోసం ప్రయాణికులు లైఫ్ జాకెట్లను తీసేశారు. లైఫ్ జాకెట్లను తీసేయడం వల్లే మృతుల సంఖ్య పెరిగిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. లైఫ్ జాకెట్లు ధరించిన వారు సురక్షితంగా బయటపడ్డారు.
సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం ఉదయం పాపికొండలకు వశిష్ట బోటు బయలుదేరింది. ఉదయం 10.30గంటలకు పోచమ్మ గండి నుంచి బయలుదేరింది. కచ్చులూరు దగ్గర గోదావరి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. వెనక్కి తీస్తుండగా రాయికి తగిలి బోటు తిరగబడినట్లు సమాచారం.
పాపికొండల పర్యాటకానికి వెళ్లిన రాయల్ వశిష్ట ప్రైవేటు బోటు బోల్తా కొట్టింది. ఈ బోటుకు పర్యాటక అనుమతి లేదని అధికారులు నిర్ధారించారు. NDRF బృందాలు, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, గజ ఈతగాళ్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. చీకటి పడడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుంది.