KCR చివరి సభ : వికారాబాద్ సభకు భారీ ఏర్పాట్లు

తెలంగాణ ముఖ్యమంత్రి KCR ఎన్నికల ప్రచారంలో దూసుకెళుతున్నారు. పలు సభల్లో పాల్గొంటున్నారు. ఏప్రిల్ 09వ తేదీ మంగళవారంతో ప్రచారం ముగియనుంది. వికారాబాద్ సభతో కేసీఆర్ ప్రచారానికి స్వస్తి పలకనున్నారు. సీఎం సభ కోసం పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభా ఏర్పాట్లను పరిశీలించారు. రెండు లక్షల మందిని జనసమీకరణ చేయనున్నట్టు తెలిపారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏప్రిల్ 08వ తేదీ సోమవారం వికారాబాద్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. కేసీఆర్ పాల్గొనే చివరి సభ కావడంతో టీఆర్‌ఎస్ శ్రేణులు సభకు భారీగా జన సమీకరణ చేస్తున్నారు. వికారాబాద్, పరిగి, తాండూరు, చేవెళ్ల, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనాన్ని ఈ సభకు సమీకరణ చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా కోటాలు తీసుకుని మరీ సమీకరణ చేస్తున్నారు.
దాదాపు లక్షన్నర నుంచి రెండు లక్షల మందిని తరలించాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. వికారాబాద్ సభా ఏర్పాట్లను టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హోమంత్రి మహమూద్‌అలీ, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి పరిశీలించారు. గ్రౌండ్ అంతా కలియ తిరుగుతూ కేటీఆర్ పలు సూచనలు చేశారు. పార్కింగ్‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా పది ఎకరాలకుపైగా స్థలాన్ని కేటాయించారు. సభకు వచ్చే వారికి మంచినీరు, మజ్జిగ ఏర్పాట్లు చేస్తున్నారు.
సభా ఏర్పాట్లు పరిశీలించిన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. 40 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ గరీబీ హఠావో అంటే నేడు రాహుల్ గాంధీ కూడా న్యాయ్ అంటూ అదే నినాదం ఇస్తున్నారని విమర్శించారు. ఇన్నేళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ పేదరికాన్ని రూపుమాపలేదనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. 70ఏళ్ల కాంగ్రెస్, బీజేపీ పాలనలో దేశం పేదరికంలోనే మగ్గిపోయిందని మండిపడ్డారు. ఈసారి కేంద్రంలో రాబోయేది ప్రాంతీయ పార్టీల సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వమేనని తెలిపారు. వికారాబాద్‌లో జరిగే సభలో జనం భారీ సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.