INDIA 3rd Meet: బెంగళూరులో అలా.. ముంబైలో ఇలా.. విపక్షాల సమావేశాల్లో నితీశ్ కుమార్‭కు వింత అనుభవాలు

రెండవ సమావేశాల సందర్భంగా బెంగళూరులో కూడా అన్ని పార్టీల నేతల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెలిసినవే. బిహార్ లో గంగా నదిపై నిర్మిస్తోన్న కేబుల్ బ్రిడ్జీ కూలిపోయిన విషయం తెలిసిందేగా.

INDIA 3rd Meet: బెంగళూరులో అలా.. ముంబైలో ఇలా.. విపక్షాల సమావేశాల్లో నితీశ్ కుమార్‭కు వింత అనుభవాలు

2024 Elections: విపక్ష కూటమి ఇండియా మూడవ సమావేశాలు ముంబైలో ప్రారంభమయ్యాయి. కూటమిలోని విపక్ష పార్టీలన్నీ ఈ సమావేశానికి హాజరయ్యాయి. అయితే విపక్షాలను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషిండమే కాకుండా పాట్నాలో జరిగిన మొదటి సమావేశానికి అన్నీ తానై చూసుకున్న బిహార్ ముఖ్యమంత్రికి నితీశ్ కుమార్‭కి ఈ సమావేశంలో ఒక ఆసక్తికర పరిణామం ఎదురైంది. చిత్రమేంటంటే.. దీనికి ముందు బెంగళూరులో జరిగిన రెండవ సమావేశాల సమయంలో ఆయనకు ఇలాంటిదే ఎదురైంది. అయితే బెంగళూరు సందర్భం అసంతృప్తి కలిగించేది అయితే ముంబై సందర్భం ఆనందాన్ని కలిగించేది.


ముంబై సందర్భం..
మూడవ సమావేశాల సందర్భంగా ముంబైలో పలు చోట్ల వివిధ నాయకుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అన్ని పార్టీల అధినేతల ఫ్లెక్సీలు వెలిశాయి. నితీశ్ కుమార్ మద్దతుదారులు కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీల్లో ‘దేశం నితీశ్ కుమార్‭ను కోరుకుంటోంది’ అంటూ రాసుకొచ్చారు. ఇండియా కన్వీనర్ గా నితీశ్ కుమార్ ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయన్న నేపథ్యంలో ఇలాంటి ఫ్లెక్సీలు ఆయనకు మరింత బూస్ట్ ఇచ్చాయి. అయితే రెండవ సమావేశాల సందర్భంగా బెంగళూరులో కూడా నితీశ్ పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. కానీ అవి నితీశ్ ని ఇబ్బంది పెట్టేవిగా ఏర్పాటు చేశారు.


బెంగళూరు సందర్భం..
రెండవ సమావేశాల సందర్భంగా బెంగళూరులో కూడా అన్ని పార్టీల నేతల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెలిసినవే. అయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి నితీశ్ ఫొటోలతో వెలిసిన ఫ్లెక్సీల్లో నితీశ్ ను తులనాడుతూ అభ్యంతరకరంగా ఏర్పాటు చేశారు. బిహార్ లో గంగా నదిపై నిర్మిస్తోన్న కేబుల్ బ్రిడ్జీ కూలిపోయిన విషయం తెలిసిందేగా. ఆ ఫొటోలు వేస్తూ ‘ప్రధానమంత్రి పదవికి అర్హత లేని నాయకుడు’ అంటూ రాసుకొచ్చారు. అదే కేబుల్ బ్రిడ్జి రెండుసార్లు కూలిపోయిన విషయాన్ని కూడా ప్రస్తావించారు. దీంతో బెంగళూరు సమావేశాల్లో భాగంగా నేతల ముఖ్యసమావేశం ముగియగానే మీడియా సమావేశంలో పాల్గొనకుండానే నితీశ్ కుమార్ వెళ్లిపోయారు. ఆర్జేడీ నేత తేజశ్వీ కూడా నితీశ్ తో పాటే వెళ్లిపోయారు.