సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ జగనేనా? వైసీపీని దెబ్బతీయడమే లక్ష్యమా?

వైఎస్‌ వారసత్వం కోసం ప్రయత్నిస్తున్న ఏపీసీసీ చీఫ్‌ షర్మిలకు బాసటగా నిలుస్తామని.. అవసరమైతే కడపలో వీధుల్లో తిరుగుతామన్న రేవంత్‌రెడ్డి కామెంట్స్‌ లోగుట్టు ఏంటి?

సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ జగనేనా? వైసీపీని దెబ్బతీయడమే లక్ష్యమా?

Cm Revanth Reddy : వైఎస్‌ఆర్‌ అంటే ఓ బ్రాండ్‌. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్‌ ఫాలోవర్స్‌ లక్షల్లోనే ఉన్నారు. వీరంతా ఏపీలో వైసీపీ వెంటే ఉన్నారు… వైసీపీ ఓటు బ్యాంకులో 90 శాతం వైఎస్‌ అభిమానులే అనేది కాదనలేని నిజం… ఇలాంటి ఓటు బ్యాంకుపై కాంగ్రెస్‌ ఫోకస్‌ చేసిందా? అనేదే ఇప్పుడు అందరి సందేహం!! వైఎస్‌ఆర్‌ జయంతి వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు దేనికి సంకేతం….? వైఎస్‌ వారసత్వం కోసం ప్రయత్నిస్తున్న ఏపీసీసీ చీఫ్‌ షర్మిలకు బాసటగా నిలుస్తామని.. అవసరమైతే కడపలో వీధుల్లో తిరుగుతామన్న రేవంత్‌రెడ్డి కామెంట్స్‌ లోగుట్టు ఏంటి?

వైఎస్‌ కుమార్తె షర్మిల కోసం పెద్ద స్కెచ్..
ఏపీ రాజకీయాల్లో పాగా వేయాలనుకుంటున్న కాంగ్రెస్‌… మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బ్రాండ్‌పై ఫోకస్‌ చేసిందా? అనే సందేహాం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌ నేతగా వైఎస్‌ను చూపడంతోపాటు వైఎస్‌ కుమార్తె షర్మిల కోసం పెద్ద స్కెచ్చే వేస్తున్నారు ఆ పార్టీ నేతలు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను బలహీనపరచి… ఆ స్థానాన్ని ఆక్రమించే ప్లాన్‌ను కాంగ్రెస్‌ రచిస్తున్నట్లు కనిపిస్తోంది. వైఎస్‌కు నిజమైన వారసులు ఎవరు అనే చర్చను లేవదీయడం ద్వారా…. వైసీపీని టార్గెట్‌ చేశారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.

వైసీపీని మరింత దెబ్బతీయడమే లక్ష్యం..
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోయింది. ఆ స్థానాన్ని ఆక్రమించిన వైసీపీ… అటు కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుతోపాటు దివంగత మాజీ సీఎం వైఎస్‌ బ్రాండ్‌తో ఏపీలో వైసీపీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీని మరింత దెబ్బతీయడం ద్వారా ఏపీలో ఎదగాలనే స్కెచ్‌ రెడీ చేస్తోంది కాంగ్రెస్‌. ఏపీసీసీ చీఫ్‌ షర్మిల మాత్రమే వైఎస్‌ నిజమైన వారసురాలని… రాహుల్‌గాంధీని ప్రధానిగా చూడాలనే వైఎస్‌ఆర్‌ కలలను నిజం చేసేందుకు పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్‌రెడ్డి. ఇదే సమయంలో వైఎస్‌ తనయుడు మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు బీజేపీకి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రశ్నించారు. అటు షర్మిల కూడా జగన్‌-బీజేపీ బంధంపై విమర్శలు చేయడం ద్వారా వైఎస్‌ బ్రాండ్‌ను సొంతం చేసుకునే పనిని వేగవంతం చేసినట్లే కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు.

వైఎస్ అభిమానులను ఆకర్షించడమే ప్రధాన ఉద్దేశం..
ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు పెద్దగా బలం లేదని చెబుతూనే… షర్మిల కోసం తామంతా కష్టపడి పనిచేస్తామని స్పష్టమైన సంకేతాలిచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి…. 2029 నాటికి షర్మిల ఏపీ ముఖ్యమంత్రి అవుతారని రేవంత్‌ వ్యాఖ్యల్లో కొంత అతిశయం కనిపించినా… వైఎస్‌ అభిమానులను ఆకర్షించడమే ఇందులో ప్రధాన ఉద్దేశమని భావిస్తున్నారు పరిశీలకులు. కాంగ్రెస్‌ స్కెచ్‌ను పకడ్బందీగా అమలు చేసేలా… కడపలో ఉప ఎన్నిక జరిగితే తామంతా కాంగ్రెస్‌ తరఫున ప్రచారం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం హాట్‌టాపిక్‌గా మారింది. ఓ పార్టీ సోషల్‌ మీడియా ప్రచారాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన రేవంత్‌రెడ్డి…. తన టార్గెట్‌ వైసీపీ అనేది తేల్చి చెప్పారంటున్నారు పరిశీలకులు.

అసలు ఉద్దేశం వైసీపీని దెబ్బతీయడమేనా?
వాస్తవానికి ఏపీ రాజకీయాల్లో తెలంగాణ నాయకుల ప్రభావం ఎక్కువగా ఉండదు. కానీ, తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఏపీ రాజకీయాలపై ఫోకస్‌ పెంచారు. పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో ఏపీలో పర్యటించిన రేవంత్‌రెడ్డి…. ఇప్పుడు కడపలో ఉప ఎన్నిక జరిగితే ప్రచారం చేస్తాననడంలో అసలు ఉద్దేశం వైసీపీని దెబ్బతీయడమేనా? అనే సందేహాం వ్యక్తమవుతోంది. వాస్తవానికి పార్లమెంట్‌ ఎన్నికల్లో కడప లోక్‌సభ అభ్యర్థిగా షర్మిల పోటీ చేసినా, ఆమెకు మద్దతుగా ప్రచారం చేయలేదు రేవంత్ రెడ్డి. కానీ, ఇప్పుడు కడపలో ప్రచారానికి వస్తామని చెప్పడం ద్వారా వైఎస్‌ అభిమానుల ఓట్లను ఆకర్షించడమే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోందంటున్నారు.

ఏపీ రాజకీయాల్లో సీఎం రేవంత్ వ్యాఖ్యల కలకలం..
మొత్తానికి అన్నాచెల్లెళ్ల మధ్య జరుగుతున్న వారసత్వ యుద్ధంలో ఎంట్రీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి…. ఏపీ రాజకీయాలను మలుపు తిప్పాలని భావించడమే ఓ ట్విస్టు. ఇక దీనిపై ఇంతవరకు స్పందించని వైసీపీ… కాంగ్రెస్‌ స్కెచ్‌ను ఎలా తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇన్నాళ్లు కడప లోక్‌సభ ఉప ఎన్నిక జరుగుతుందని టీడీపీ సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. దీనినే ఆధారంగా చేసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు చేయడంతో వైసీపీ స్పందించాల్సిన పరిస్థితి తీసుకువచ్చింది. ఇన్నాళ్లు మాజీ సీఎం జగన్‌ను రాజకీయంగా ఇబ్బంది పెట్టే ఆలోచనతో సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోందని భావించినా, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌ చేసిన కామెంట్లు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. దీనికి వైసీపీ ముగింపు ఎలా ఉంటుందనేదే ఉత్కంఠ పెంచుతోంది.

Also Read : ఆ భయంతో నిద్రలేని రాత్రులు..! నాడు చక్రం తిప్పిన నాయకులు నేడు ఏమైపోయారు?