శ్రీశైలం ఆలయ పోలీసులనే బురిడీ కొట్టించిన నకిలీ పోలీసు.. అసలేం జరిగిందంటే..

తీరు మార్చుకోని ప్రశాంత్ మళ్లీ అదే పంథా మొదలు పెట్టాడు. ఇప్పుడు ఏకంగా తన తెలివి తేటలతో శ్రీశైలం ఆలయ పోలీసులనే బురిడీ కొట్టించాలనుకున్నాడు. కానీ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.

శ్రీశైలం ఆలయ పోలీసులనే బురిడీ కొట్టించిన నకిలీ పోలీసు.. అసలేం జరిగిందంటే..

Fake Police : నేను పోలీసు..నాకు రాచమర్యాదలు కావాలి. రుబాబుగా అడిగే సరికి నిజమే కాబోలు అనుకున్నారు. వీఐపీ దర్శనం ఏర్పాటు చేశారు. అద్భుతమైన వసతి కల్పించారు. కానీ అనుమానం అసలు నిజాన్ని బయటపెట్టింది. వీడు ఖాకీ పేరు చెప్పుకుంటున్న ఫేక్‌గాడని తేలింది. ఇంకేముంది..బెండు తీశారు..రిమాండ్‌కు తరలించారు.

నిత్యం వేలాది భక్తులతో రద్దీగా ఉండే శ్రీశైలం దేవాలయ పోలీసులను బురిడీ కొట్టించాడో నకిలీ పోలీసు. ఆలయంలో రాచమర్యాదలు పొందాలని ప్లాన్‌ వేశాడు. నకిలీ ఆర్‌ఎస్‌ఐ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఆలయ పోలీసులు ఇతగాడి పిట్టకథలన్నీ నిజమేనని నమ్మారు. శ్రీశైలం ఆలయంలో దర్జాగా వీఐపీ దర్శనం చేయించుకున్నాడు. అసలు పోలీసులకు ఈ నకిలీ పోలీసుపై అనుమానం రావడంతో అసలు బండారం బయటపడింది.

వరంగల్‌కు చెందిన కుసుమ ప్రశాంత్.. సెప్టెంబర్‌ 1న శ్రీశైలం ఆలయానికి వచ్చాడు. తాను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఆర్ఎస్సైగా పనిచేస్తున్నట్లు శ్రీశైలం పోలీసులకు చెప్పి, తనను తాను పరిచయం చేసుకున్నాడు. ముందుగానే తయారు చేసుకున్న నకిలీ ఐడీ కార్డును కూడా వారికి చూపాడు. అనంతరం తనకు వసతి గది, వీఐపీ దర్శనం ఏర్పాటు చేయాలని వారిని కోరాడు. దీంతో సాధారణంగా శ్రీశైలం దర్శనానికి పోలీసులు వస్తుంటారు కదా అని శ్రీశైలం పోలీసులు ప్రోటోకాల్ దర్శనం కూడ చేయించారు. స్వామి, అమ్మవార్ల దర్శనంతోపాటు వసతి కూడా ఏర్పాటు చేశారు.

అయితే వర్షాల కారణంగా శ్రీశైలంలో దారుణలన్నీ అధికారులు మూసివేశారు. దీంతో ప్రశాంత్ తిరిగి శ్రీశైలానికి వచ్చాడు. దీంతో కుసుమ ప్రశాంత్ తీరుపై అక్కడి పోలీసులకు అనుమానం వచ్చింది. వెంటనే శ్రీశైలం ఒకటో పట్టణ సీఐ ప్రసాదరావుకు సమాచారం ఇవ్వడంతో ఆయన ఆధ్వర్యంలో పోలీసులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో ప్రశాంత్.. నకిలీ ఆర్ఎస్సైగా పోలీసులు గుర్తించారు.

Also Read : ఎలాంటి సర్టిఫికెట్ అయినా డబ్బులిస్తే చిటికెలో చేతిలో పెడతారు..! వెలుగులోకి నకిలీ సర్టిఫికెట్ల బాగోతం

నంద్యాల పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిందితుడిని అదుపులోకి తీసకున్నారు. అతడిపై కేసు నమోదు చేశారు. అలాగే ప్రశాంత్ దగ్గర గల నకిలీ పోలీసు గుర్తింపు కార్డు, కారు, నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ప్రసాదరావు తెలిపారు.

కుసుమ ప్రశాంత్ ఇలాంటి మోసాలకు పాల్పడటం ఇదేం తొలిసారి కాదు. గతంలోనూ తెలంగాణలో పలు మార్లు ఫ్రాడ్‌లకు పాల్పడినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. గతంలో నకిలీ పోలీసు అధికారిగా చెప్పుకొని ఓ వ్యక్తి నుంచి ప్రశాంత్ 40 వేలు వసూలు చేశాడు. దీనిపై ఘట్‌కేసర్‌ పోలీసు స్టేషన్‌లో అతడిపై కేసు కూడా నమోదైంది. అయినా తీరు మార్చుకోని ప్రశాంత్ మళ్లీ అదే పంథా మొదలు పెట్టాడు. ఇప్పుడు ఏకంగా తన తెలివి తేటలతో శ్రీశైలం ఆలయ పోలీసులనే బురిడీ కొట్టించాలనుకున్నాడు. కానీ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.