AP High Court : తగ్గేదే లేదు..కుర్చీలతో కుమ్మేసుకున్న లాయర్లు

ఏపీ హైకోర్టు న్యాయవాదులు రెచ్చిపోయారు.. వర్గాలుగా విడిపోయి పోరుకు తెరలేపారు.. తగ్గేది లేదంటూ కుర్చీలతో కుమ్మేసుకున్నారు.

AP High Court : తగ్గేదే లేదు..కుర్చీలతో కుమ్మేసుకున్న లాయర్లు

Ap High Court

Updated On : April 9, 2021 / 6:54 AM IST

Advocates Fighting : ఏపీ హైకోర్టు న్యాయవాదులు రెచ్చిపోయారు.. వర్గాలుగా విడిపోయి పోరుకు తెరలేపారు.. తగ్గేది లేదంటూ కుర్చీలతో కుమ్మేసుకున్నారు.. మరి లాయర్ల మధ్య గొడవెందుకు వచ్చింది.. అసలు ఘర్షణకు కారణామేంటి..? పెద్ద పెద్ద కేసులు వాదించే లాయర్లు. మరి వీరు ఇలా కొట్టుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది..? వర్గపోరే ఘర్షణకు కారణమా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అమరావతిలో హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ జనరల్‌ బాడీ సమావేశం రసాభాసగా మారింది. బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలపై చర్చించేందుకు సమావేశమైన సభ్యుల మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేదాకా వెళ్లింది. న్యాయవాదుల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా.. కొంతమంది సభ్యులు కుర్చీలతో పరస్పరం దాడి చేసుకున్నారు.

సాధారణంగా ప్రతీ ఏడాది బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతుంటాయి. ఈ ఏడాది ఇప్పటికే సుప్రీం కోర్టు నుంచి బెజవాడ కోర్టు వరకు అన్ని న్యాయస్థానాలకు బార్ కౌన్సిల్ ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే అమరావతిలోని ఏపీ హైకోర్టు బార్ కౌన్సిల్ ఎన్నికలు మాత్రం ఇప్పటివరకూ జరగలేదు. గతేడాది కరోనా కారణంగా వాయిదా పడ్డ ఎన్నికలను ఇప్పుడు నిర్వహించేందుకు తాజాగా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. హైకోర్టును ప్రభుత్వం కర్నూలు తరలించే యోచనలో ఉంది కాబట్టి.. అక్కడికి తరలించాకే ఎన్నికలు నిర్వహించాలని రాయలసీమకు చెందిన న్యాయవాదులు కోరినట్లు తెలుస్తోంది.

ఈ ప్రతిపాదనను కోస్తాకు చెందిన కొంతమంది న్యాయవాదులు వ్యతిరేకించడంతో ఇరువురి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఎన్నికలు ఇక్కడే నిర్వహించాలని ఒక వర్గం.. లేదు హైకోర్టును కర్నూలుకు తరలించాకే నిర్వహించాలని మరో వర్గం పట్టుబట్టడమే గొడవకు కారణంగా తెలుస్తోంది. న్యాయవాదులు కోస్తా వర్గం,రాయలసీమ వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగినట్లు సమాచారం. న్యాయవాదులు కుర్చీలతో దాడి చేసుకోవడంతో.. బార్ ‌కౌన్సిల్‌ సభ్యుడు అజయ్ కుమార్‌ తలకు గాయాలయ్యాయి. దీంతో హైకోర్టు చీఫ్ జస్టిస్‌ను కలిసి ఫిర్యాదు చేశారాయన.
Read More : Khammam : షర్మిల బహిరంగసభ..6 వేల మందికి మాత్రమే అనుమతి, విజయలక్ష్మి హాజరు