నెల్లూరులో రెచ్చిపోయిన బెట్టింగ్ మాఫియా

  • Published By: murthy ,Published On : November 17, 2020 / 04:03 PM IST
నెల్లూరులో రెచ్చిపోయిన బెట్టింగ్ మాఫియా

cricket betting mafia attack young man in nellore : నెల్లూరు జిల్లాలో బెట్టింగ్ మాఫియా రెచ్చిపోయింది. ఐపీఎల్ బెట్టింగ్ డబ్బులు కట్టలేదని ఓ యువకుడిపై  విచక్షణా రహితంగా దాడి చేసి చావ బాదారు. ముత్యాలపాలెనికి చెందిన యువకుడిని తీవ్రంగా కొట్టారు. ఐపీఎల్ బెట్టింగ్ ల్లో భారీగా డబ్బులు పెట్టి నష్టాలు రావటంతో పలువురు ఆత్మహత్య చేసుకున్న ఘటనలు గతంలో చాలా జరిగాయి.

తాజాగా ఐపీఎల్ బెట్టింగ్ డబ్బులు ఇవ్వలేదని రాజశేఖర్ అనే వ్యక్తి…. ఒక యువకుడిని కర్రతో చావబాదుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈఘటన జరిగి నాలుగైదురోజులైనప్పటికీ పోలీసులు ఈ ఘటనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తి కొట్టవద్దని బతిమలాడుతున్నా రాజశేఖర్ అనే వ్యక్తి కర్రతో చావబాదాడు.



పొదలకూరు రోడ్డులో నివసించే రాజశేఖర్ మద్రాసు బస్టాండ్ వద్ద వున్న పాల డైరీ లో పని చేస్తూ ఉంటాడు. ఖాళీ సమయాల్లో గంజాయి సేవించటం….క్రికెట్ బెట్టింగ్ లు నిర్వహించటం.. వంటి పలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది.



అతని వద్ద ముత్యాలపాలెనికి చెందిన యువకుడు ఐపీఎల్ సమయంలో బెట్టింగ్ కాశాడు. బెట్టింగ్ లో నష్టం రావటంతో డబ్బు చెల్లించలేక పోయాడు. ఇది ఆసరాగా తీసుకుని రాజశేఖర్ ముత్యాలపాలెం వెళ్లి ఆ యువకుడిని ఇంటి నుంచి ఊరి బయట నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువచ్చి కర్రతో విచక్షణా రహితంగా చావబాదాడు. ఈఘటన జరిగి నాలుగైదు రోజులైనప్పటికీ నెల్లూరు లోని బెట్టింగ్ మాఫియాకు భయపడి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది.

కొద్ది రోజుల క్రితం టీడీపీకి చెందిన తిరుమల నాయుడు అనే వ్యక్తి పై జరిగిన దాడిలో రాజశేఖర్ ముద్దాయి అని తెలుస్తోంది. గతంలో పోలీసులు బెట్టింగ్ మాఫియాపై దాడులు చేసి కేసులు పెట్టినా నెల్లూరులో బెట్టింగ్ మాఫియాను అరికట్టలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.



నెల్లూరుకి చెందిన వ్యక్తి జాతీయ స్ధాయిలో బుకీగా ఎదిగాడు. గతంలో జిల్లా ఎస్పీ రామకృష్ణగా ఉన్న సమయంలో కొంత అదుపులోకి తెచ్చినప్పటికీ మళ్లీ నెల్లూరులో బెట్టింగ్ మాఫియాను రూపు మాపలేకపోతున్నారు.