సైంటిస్ట్ కాబోయి…సన్యాసి గామారిన నిజామాబాద్ యువతి

  • Published By: chvmurthy ,Published On : February 29, 2020 / 01:43 PM IST
సైంటిస్ట్ కాబోయి…సన్యాసి గామారిన నిజామాబాద్ యువతి

అనంతపురం జేఎన్టీయూలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉన్నత చదువులకు అమెరికా వెళ్లి అక్కడ ఎమ్మెస్ పూర్తి చేసి నానో టెక్నాలజీలో పరిశోధనలు చేస్తూ అకస్మాత్తుగా మాయమైన యువతి సన్యాసిలాగా మారిపోయింది. కన్నకూతురు కోసం  గత ఐదేళ్లుగా తల్లితండ్రులు చేస్తున్న అలుపెరుగని పోరాటానికి సాయపడేవారే లేకపోయారు. గొప్ప సైంటిస్టుగా చూడాల్సిన  కూతురుని సన్యాసిలాగా,  భక్తి ముసుగులో  అనారోగ్యం పాలైన పరిస్ధితిలో చూస్తూ ఆ మాతృహృదయం ఎంతగా  తల్లడిల్లిందో ఎవరికి తెలుసు? 

ఆధ్యాత్మిక ముసుగులో కూతురు మాట్లాడిన వింత మాటలకు చేష్టలుడిగి చూడటం మినహా ఏమీ చేయలేని నిస్సహాయ స్ధితిలో తల్లితండ్రులున్నారు. ఎందుకంటే ఆమెను ఆ మాయా ప్రపంచం నుంచి బయటకు తీసుకురాలేక పోతున్న చట్టాలు. ఢిల్లీలోని వీరేంద్ర దేవ్ దీక్షిత్  స్ధాపించిన ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయంలో చేరిన నిజామాబాద్ కు చెందిన సంతోషి రూప తల్లి తండ్రుల ఆవేదన తీర్చే వారే కరువయ్యారు. ఆతల్లి తండ్రుల కన్నీళ్లు తుడిచే బాధ్యత ఎవరు తీసుకుంటారో?  ఆశ్రమంలో బందీగా మారిన తన కూమార్తెని ఎలాగైనా విడిపించాలని సంతోషి రూప తల్లితండ్రులు రాం రెడ్డి,మీనా కోరుతున్నారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని తనకు సహాయంచేయాలని వారు అభ్యర్థిస్తున్నారు. 

ఉన్నత చదువులు చదువుకుని పరిశోధనలు సాగిస్తున్న నిజామాబాద్ కు చెందిన సంతోషి రూప ఏమైందో ఏమో కానీ ఢిల్లీకి చెందిన వృధ్ధ స్వామిజీ  వీరేంద్ర దేవ్ దీక్షిత్ చెరలో చిక్కుకుంది.  కాటికి కాళ్లు జాపుకున్న సాములోరు రేపో మాపో బాల్చి తన్నేయటానికి సిధ్దంగా ఉన్నాడు. తాను శ్రీకృష్ణుడి అవతారమని ప్రకటించుకున్నాడు. చనిపోయేలోగా 16వేలమందితో శృంగారం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. 

ఇందుకోసం  ఆధ్యాత్మిక యూనివర్సిటీని ఒకదాన్ని స్ధాపించాడు. 2020 లో ప్రపంచం అంతమై పోతుందని తనను ఆశ్రయించిన వారిని రక్షిస్తానని ప్రచారం చేసుకుంటూ అమాయక యువతులను  మాయమాటలతో  యూనివర్సిటీలో చదువు పేరుతో చెరబట్టాడు.  మరోవైపు తన దగ్గరకొచ్చే మూఢభక్తులను తన మాయలో పడేసి.. వారి కూతుళ్లను ఆశ్రమానికి పంపాలని కోరేవాడు…ఒక్కసారి ఆ ఆశ్రమంలో అడుగుపెట్టిన ఆడపిల్ల జీవితం ఇక ఆశ్రమానికి అంకితం. 

అమ్మానాన్నలను చూడ్డానికి కూడా వారికి అవకాశం ఉండదు. సాములోరి మీద నమ్మకంతో కూతుళ్లను పంపిన తల్లితండ్రులు వారి పిల్లలను చూడాలంటే గంటల కొద్దీ  వేచి చూడాల్సిందే..  దేశవ్యాప్తంగా ఈ ఆశ్రమానికి అనేక బ్రాంచిలు ఉన్నాయి. ఢిల్లీలోనే ఐదు కేంద్రాలు ఉన్నాయి. అతడు ఏ ఆశ్రమానికి వెళితే ఆ ఆశ్రమంలో గుప్త ప్రసాదం పేరుతో 8 నుంచి 9 మంది అమ్మాయిలు ఆ రాత్రి  ఈముసలోడితో గడపాలని… ఆరాత్రి అతడితో గడిపిన యువతులను మర్నాటి నుంచి రాణులుగా పిలుస్తారని ఆశ్రమం నుంచి బయటపడ్డ యువతులు చెపుతున్నారు. 

ఇప్పటికీ ఆశ్రమంలోని ఇరుకు గదుల్లో దాదాపు 168 మంది యువతులు ఉన్నట్లు తెలుస్తోంది.  2017 జూన్‌లో ఒక యువతి తల్లిదండ్రులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో వీరేంద్ర దేవ్‌ యువతుల పట్ల చేస్తున్న అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. కోర్టు ఆదేశాలతో  పోలీసులు, న్యాయవాదులతో ఏర్పాటైన ఒక కమిటీ వీరేంద్ర దీక్షిత్ ఆశ్రమంపై దాడి చేసి తనిఖీలు నిర్వహించి 67 మంది బాలికలను విడిపించింది. ఆ ఆశ్రమంలో మహిళలు, యువతులను ఇరుకిరుకు గదుల్లో జంతువుల్లా బందీలుగా ఉంచుతున్నారని కోర్టుకు తెలిపింది. వారికి మాదక ద్రవ్యాలు అలవాటు చేస్తున్నారని రాంరెడ్డి ఆరోపిస్తున్నారు.

తాను బ్రహ్మకుమారి సంస్థ వ్యవస్థాపకులు లేఖ్ రాజ్ కృపలానీ స్ఫూర్తితో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతున్నట్లు వీరేంద్ర దేవ్  ఆశ్రమం స్ధాపించే తొలినాళ్లలో చెప్పు కొచ్చేవారు. అయితే వీరేంద్ర ప్రచారాన్ని బ్రహ్మకుమారీస్ సంస్థ ఖండించింది. అయినా తన కార్యక్రమాలు ఆపలేదు. తదనంతరం కాలంలో ఢిల్లీలో ఆధ్యాత్మిక ఐశ్వర్య విశ్వవిద్యాలయ్ ఏర్పాటు చేశాడు. హైకోర్టు ఆదేశాలతో విశ్వ పదాన్ని తొలగించాడు. రకరకాల ప్రచారాలతో యువతులను ఓ రకమైన భావోన్మాదానికి గురిచేసి అక్కడే ఉండేలా చేస్తాడు. నిత్యానంద, డేరా బాబాలను మించి దొంగ బాబా అతడు. 

2020లో ప్రపంచం అంతమైపోతుందని.. తనను ఆశ్రయించిన వారిని రక్షిస్తానని చెప్పుకొంటూ అమాయకులను ఆకట్టుకున్నాడు. కానీ 2017 జూన్ లో  ఒక యువతి తల్లితండ్రులు  ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించటంతో వీరేంద్ర దేవ్ లీలలలు బయటపడ్డాయి.  హై కోర్టు ఆదేశాలతో వీరేంద్ర దేవ్ పై  పెట్టిన పోలీసు కేసులను సీబీఐ కి బదలాయించారు. 2018 జనవరిలో వీరేంద్ర దేవ్‌ అక్రమాలపై సీబీఐ మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసింది. అయితే, అప్పటికే అతడు పరారైపోయాడు. అతడిపై రెండుసార్లు లుక్‌అవుట్‌ నోటీసులు జారీ అయ్యాయి. 

ఇంటర్‌పోల్‌ బ్లూనోటిస్‌ జారీ చేసింది. రెండేళ్లుగా వీరేంద్ర దేవ్‌ పరారీలో ఉన్నాడు.. అతడి ఆశ్రమం మాత్రం  నిరాఘాటంగా ఇంకా నడుస్తూనే ఉంది. కాగా, 1998లో ఒకసారి వీరేంద్రదేవ్‌ అరెస్టు అయ్యి ఆరు నెలలపాటు జైల్లో ఉన్నాడు.  వీరేంద్రదేవ్‌ పరారవడానికి రెండేళ్ల ముందు అనగా 2015లో, నిజామాబాద్‌కు చెందిన సంతోషిరూప అతగాడి ఉచ్చుకు చిక్కింది. ఇప్పుడుసంతోషి తల్లి తండ్రులు ఆమెను ఆశ్రమం నుంచి బయటకు తీసుకువెళ్లేందుకు గత 5 ఏళ్ళుగా ప్రయత్నిస్తున్నారు. 

నిజామాబాద్‌ జిల్లాకు చెందిన దుంపల రాం రెడ్డి, మీనవతి దంపతులు కూతురు సంతోషి రూప..అనంతపురం జేఎన్టీయూలో కెమికల్ ఇంజనీరింగ్ చదివి, అమెరికాలో ఎమ్మెస్ పూర్తిచేసి నానో టెక్నాలజీలో పరిశోధన చేసే సమయంలో 2015 లో ఆదృశ్యమయ్యింది. ఆమె గురించి తల్లితండ్రులు ఆరా తీయగా చివరికి ఢిల్లీలోని వీరేంద్ర దేవ్ స్థాపించిన ఆధ్యాత్మిక విద్యాలయ ఆశ్రమంలోఉన్నట్లు తెలుసుకున్నారు. ఆమెను ఇంటికి తీసుకు వెళ్లటానికి అక్కడకు వెళ్లిన  తల్లి తండ్రులకు చేదు అనుభవం ఎదురయ్యింది.  ఆమెకు ముందుగానే బ్రెయిన్ వాష్ చేసి నలుగురు మనుషుల మధ్య కూర్చోపెట్టి  మట్లాడిస్తారని వారు ఆరోపిస్తున్నారు.  

తమ కూతురుతో తాము స్వేఛ్ఛగా మాట్లాడలేని పరిస్ధితి అక్కడు ఉందన్నారు రాంరెడ్డి. కొన్ని సార్లు  కేవలం తండ్రి రాం రెడ్డిని మాత్రమే నిర్వాహకులు లోపలికి అనుమతించి ఆమెతో మాట్లాడేందుకు అవకాశం కల్పించేవారు. సమస్యను  సున్నితంగా పరిష్కరించుకునే క్రమంలో వారు చాలా ఓపికపట్టారు. సంతోషి రూప  వయస్సు ఇప్పుడు 35 సంవత్సరాలు. ఇంటికి రమ్మని ఎంతగా బతిమలాడినా ఆమె వినిపించుకోలేదు. 

పైగా ‘నేను దేవతగా మారబోతున్నా. మీరందరూ త్వరలో మరణిస్తారు. మళ్లీ మేం మానవ జాతిని సృష్టించి విశ్వాన్ని స్థాపిస్తాం. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి. మరోసారి నన్ను చూడటానికి రావొద్దు’ అంటూ ఆమె వింత మాటలు మాట్లాడుతుండేది… తాను ఇష్టపూర్వకంగానే ఆశ్రమంలో ఉంటున్నానని, తనను ఎవరూ ఇబ్బంది పెట్టట్లేదని, సంతోషంగా ఉన్నానని తల్లిందండ్రులతో చెప్పేది…. ఆమె మేజర్ కావటంతో వారేమి చేయలేక పోయారు. 

2017 లో ఒకసారి సంతోషి ని చూడటానికి వారు అక్కడకు వెళ్లగా రాజస్థాన్‌కు చెందిన పలువురు అక్కడ గొడవ చేస్తుండడాన్ని గమనించారు. అప్పుడే పోలీసులు ఆశ్రమంపై దాడి చేసి 67 మంది బాలికలను విడిపించారు. అప్పుడు జరిగిన తనిఖీల్లో ఆశ్రమం నుంచి ఇంజక్షన్లు, కొన్ని రకాల మందులు దొరకడం కలకలం సృష్టించింది.  చివరి సారిగా 2019 లో తమ కుమార్తెను చూశామని ఈ ఏడాది కాలంగా తమ కూతుర్ని చూపించలేదని తండ్రి రాంరెడ్డి  వాపోయారు. 

దీంతో రాంరెడ్డి దంపతులు ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ ప్రభుత్వం, సీబీఐని ప్రతివాదులుగా చేర్చి నోటీసులు జారీ చేసింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది శ్రావణ్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. వీరేంద్రపై అత్యాచారం సహా పలు కేసులు ఉన్నాయని, సీబీఐకి దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నారని న్యాయవాది శ్రావణ్‌ కుమార్‌ కోర్టుకు తెలిపారు. 

సంతోషికి మాయమాటలు చెప్పి ఆశ్రమంలో చేర్చుకున్నారని, ఆమెలాగే ఆశ్రమంలో 168 మంది యువతులు ఉన్నారని పేర్కొన్నారు. సంతోషి అమెరికా నుంచి ఇండియా వచ్చే నాటికి ఆమె బ్యాంకు అకౌంట్లో కోటి రూపాయలు ఉన్నాయని, ఆ డబ్బును ఆశ్రమ నిర్వాహకులే కాజేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు తండ్రి రాం రెడ్డి. సంతోషిని అక్కడి నుంచి విడిపించి తల్లిదండ్రులకు అప్పగించాలని న్యాయవాది  శ్రావణ్ కుమార్ కోర్టుకు విన్నవించారు. 

గత రెండేళ్లుగా పరారీలో ఉన్న వీరేంద్ర దేవ్  కోసం ఎక్కడ గాలించినా కనీసం క్లూ కూడా దొరక్కపోవడంతో సీబీఐ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. దీక్షిత్ ఆచూకీ చెప్పినవారికి రూ.5 లక్షలు ఇస్తామని సీబిఐ ప్రకటించింది. అతడి ఆచూకీ గానీ, ఆశ్రమ అక్రమాలపై సమాచారం గానీ తెలిస్తే 011-24368657 నంబర్‌కు ఫోన్‌ చేయాలని, లేదా 011-24368662 నంబర్‌కు ఫాక్స్‌ చేయాలని  లేదా , spstfdel@cbi.gov.in అనే మెయిల్ ద్వారా గానీ తమకు సమాచారం ఇవ్వాలని సీబీఐ అధికారులు తెలిపారు.