MLC Elections : అధికార పార్టీలకు ఎదురుదెబ్బ

  • Published By: madhu ,Published On : March 27, 2019 / 12:35 AM IST
MLC Elections : అధికార పార్టీలకు ఎదురుదెబ్బ

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలకు ఎదురుదెబ్బ తగిలింది. ఇరుచోట్ల అధికార పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. తెలంగాణలో TRS అభ్యర్థులపై యూటీఎఫ్‌, కాంగ్రెస్‌ కార్యకర్తలు విజయం సాధించారు. ఇక ఏపీలోనూ టీడీపీ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. వరంగల్‌ – ఖమ్మం – నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్‌ఎస్‌ బలపర్చిన తెలంగాణ పీఆర్టీయూ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పూల రవీందర్‌ ఓటమిపాలయ్యారు. ఆయనపై తెలంగాణ యూటీఎఫ్‌ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి విజయకేతనం ఎగురవేశారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 18,885 ఓట్లు పోలయ్యాయి. ఇందులో యూటీఎఫ్‌ అభ్యర్థి నర్సిరెడ్డికి 8976 ఓట్లు వచ్చాయి. పూల రవీందర్‌కు 6,279 ఓట్లు వచ్చాయి. దీంతో నర్సిరెడ్డి పూల రవీందర్‌పై విజయకేతనం ఎగురవేశారు.

కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, మెదక్‌ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూర రఘోత్తంరెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి మోహన్‌రెడ్డిపై 1707 ఓట్ల మెజార్టీతో రఘోత్తంరెడ్డి గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు.  ఈ ఉపాధ్యాయ స్థానం కోసం మాజీ ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, బి. మోహన్‌రెడ్డితోపాటు ఇతర నేతలు పోటీపడ్డారు.  చివరికి రఘోత్తంరెడ్డినే విజయం వరించింది.

కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అధికార టీఆర్‌ఎస్‌ మద్దతిచ్చిన అభ్యర్థి  చంద్రశేఖర్‌గౌడ్‌ పరాజయం పాలయ్యారు. ఈ స్థానంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఘన విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్‌కు మండలిలో జీవమొచ్చినట్టు అయ్యింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీలుగా ఉన్న పొంగులేటి సుధాకర్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ పదవీకాలం ముగింపుకు వచ్చింది. దీంతో మండలిలో కాంగ్రెస్‌ వాయిస్‌ లేకుండా పోతుందని భావిస్తున్న సమయంలో జీవన్‌రెడ్డి గెలుపుతో కాంగ్రెస్‌కు జీవమొచ్చింది. జీవన్‌రెడ్డికి 21,364 ఓట్లతో మొదటి స్థానంలో నిలిచారు. టీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థి చంద్రశేఖర్‌గౌడ్‌ 5,856 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. 

APలో :-
APలోనూ అధికార పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి షాక్‌ తగిలింది.  ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి గాదె శ్రీనివాసరావు ఘోర పరాజయం పాలయ్యారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్సీగా గెలిచిన గాదె శ్రీనివాసరావుపై పాకలపాటి రఘువర్మ విజయం సాధించారు. మొత్తం ఓట్లలో రఘువర్మకు 7834 మొదటి ప్రాధాన్యత ఓట్లు రాగా.. గాదె శ్రీనివాసరావుకు 5632 మొదటి ప్రాధాన్యత ఓట్లు మాత్రమే వచ్చాయి. మరో అభ్యర్థి అడారి కిషోర్‌కుమార్‌కు 2548 ఓట్లు పడ్డాయి. ఎవరికీ కోటా ఓట్లు రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. రెండో ప్రాధాన్యత ఓట్లలో రఘువర్మకు ఎక్కువ రావడంతో ఆయన విజయం సాధించారు. 

కృష్ణా – గుంటూరు , ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ ఈ ఉదయానికి పూర్తికానుంది.  కృష్ణా – గుంటూరు గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు ముందంజలో ఉన్నారు. ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐవీ అందరికంటే ముందు ఉన్నారు.