ఘోరాతి ఘోరం: 350 ఏనుగులు మృతి!..ఆ అడవిలో ఎక్కడ చూసినా ఏనుగుల కళేబరాలే..!!

  • Published By: nagamani ,Published On : July 2, 2020 / 03:33 PM IST
ఘోరాతి ఘోరం: 350 ఏనుగులు మృతి!..ఆ అడవిలో ఎక్కడ చూసినా ఏనుగుల కళేబరాలే..!!

కనీ వినీ ఎరుగని ఘోరం..! ఊహిస్తే మనస్సు ముక్కలైపోయే దారుణం దృశ్యాలు..!!ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 350 ఏనుగులు చచ్చిపోయాయి…!!.పచ్చని అడవిలో ఎటు చూసినా గజరాజుల కళేబరాలు పడి ఉన్నాయి. చూస్తే గుండె అవిసిపోయే ఈ మహా విషాద ఘటన దక్షిణాఫ్రికాలోని బొస్ట్వానాలో చోటు చేసుకుంది. గజరాజుల మారణకాండకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. అడవిపైనుంచి విమానంలో వెళ్లున్న ఓ డాక్టర్ అడవిలో చచ్చిపడి ఉన్న ఏనుగుల కళేబరాలను చూడటంతో ఇది వెలుగులోకి వచ్చింది.

కేవలం రెండు నెలల వ్యవధిలోనే ఈ దారుణ విలయం జరిగినట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకేసారి ఇన్ని ఏనుగులు మరణించటానికి గల కారణాలపై దర్యాప్తును ముమ్మరం చేశారు.వేటగాళ్లు చంపారని అనుకోవటానికి కూడా లేదు. ఎందుకంటే వేటగాల్లు ఏనుగుల్ని వాటి దంతాల కోసమే చంపుతారు. కానీ చనిపోయిన ఏనుగులకు వాటి దంతాలు కూడా ఉన్నాయి. దీంతో 350 ఏనుగుల మృతికి చెందిన విషయం మిష్టరీగా మారిపోయింది.

యూకెకు చెందిన ఛారిటీ నేషనల్ పార్కు రెస్క్యూకు చెందిన డాక్టర్ నియాల్ మక్కాన్ మే నెలలో ఒవావాంగో డెల్టా ప్రాంతంలో విమానంలో ప్రయాణిస్తూండగా..కిందకు చూస్తుండగా భారీ సంఖ్యలో ఏనుగుల కళేబరాలు కనిపించాయి. దీంతో ఆయన ఆశ్చర్యపోయారు. అలా ఒకటీ రెండూ అనుకుంటూ లెక్కపెడితే 169 ఏనుగు మృతదేహాలను గుర్తించారు.

కానీ మరిన్ని ఏనుగులు అప్పటికే కదలేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నవిషయాన్ని గమనించారు.వెంటనే దక్షిణాఫ్రికా ప్రభుత్వానికి తెలిజేయటంతో ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. దీనిపై వెంటనే ఈ ప్రభుత్వం సర్వే చేపట్టింది. ఆ సర్వేలో ఒక్క బొస్ట్వానా ప్రాంతంలోనే ఏకంగా 350కి పైగా ఏనుగు కళేబరాలు కనిపించాయని తేలింది. ఏనుగులు మాత్రమే చనిపోవడం ఏంటనే అంశంపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు. విష పదార్థాలు కలిసి నీరు తాగి చనిపోయానుకోవటానికి కూడా లేదు. ఎందుకంటే అడవిలో మిగిలిన జంతువులు చనిపోయినట్లుగా ఎక్కడా ఆనవాళ్లు కనిపించలేదు.

దీంతో మిష్టరీగా మారిన ఏనుగుల మరణాలపై పెద్ద ఎత్తున దర్యాప్తు కొనసాగుతోంది. దీంట్లో భాగంగా చనిపోయిన ఏనుగుల నుంచి నమూనాలు సేకరించి పరీక్షల కోసం పంపించారు. దానికి సంబంధించిన రిపోర్ట్ వస్తే కానీ ఏం జరిగింది అనేది చెప్పలేమని అధికారులు తెలిపారు. దీనిపై అధికారులు తీవ్ర ఆందోళనవ్యక్తం చేస్తున్నారు.

Read:కొండచరియలు విరిగిపడి 113 మంది సజీవ సమాధి