Power Crisis In India : పండగ పూట కరెంటు తిప్పలు…. తీవ్రమవుతున్న విద్యుత్ సంక్షోభం

దేశంలో విద్యుత్‌ సంక్షోభం ముంచుకొస్తోంది. బొగ్గు భగ్గుమంటోంది. నిల్వల కొరత వేధిస్తోంది. వాతావరణ  పరిస్థితులు మరిన్ని ఇబ్బందులు కలిగిస్తున్నాయి..

Power Crisis In India :  పండగ పూట కరెంటు తిప్పలు…. తీవ్రమవుతున్న విద్యుత్ సంక్షోభం

Power Crisis In India

Power Crisis In India :  దేశంలో విద్యుత్‌ సంక్షోభం ముంచుకొస్తోంది. బొగ్గు భగ్గుమంటోంది. నిల్వల కొరత వేధిస్తోంది. వాతావరణ  పరిస్థితులు మరిన్ని ఇబ్బందులు కలిగిస్తున్నాయి.. వెరసి థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లు  ఈసురోమంటున్నాయి. బొగ్గు సరఫరాతో పాటు ధరలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. బొగ్గు  కొరతతో చాలా రాష్ట్రాలు విద్యుత్‌ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తాజా పరిస్థితులను సమీక్షించేందుకు ఈ రోజు ప్రధానమంత్రి కార్యాలయం సిద్ధమైంది.  బొగ్గు గనుల శాఖ, విద్యుత్‌ మంత్రిత్వ శాఖలు తొందర్లోనే పరిస్థితులు చక్కబడతాయని నిన్న స్పష్టం చేశాయి. దీనికి సంబంధించి మరిన్ని అంశాలపై చర్చించేందుకు ప్రధానమంత్రి కార్యాలయం సన్నద్ధమైంది.

మరోపక్క, అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాల ఆందోళనపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా… నిన్న పలువురు కేబినెట్‌ మంత్రులతో సమావేశమయ్యారు. విద్యుత్‌ సంక్షోభ నివారణ, రాష్ట్రాలకు సరిపడా బొగ్గు, గ్యాస్‌ నిల్వలు, వాటి సరఫరాపై చర్చించారు. దేశంలో విద్యుత్‌ సంక్షోభం ఏర్పడబోతోందంటూ వస్తోన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండిస్తోంది. అవన్నీ అనవసర భయాలేనని స్పష్టం చేస్తోంది. విద్యుత్‌ ఉత్పత్తికి సరిపడా వనరులు అందుబాటులో ఉన్నాయంది. ప్రస్తుతం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల వద్ద 72 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని.. అవి నాలుగు రోజులకు సరిపోతాయంటోంది. కోల్‌ ఇండియా వద్ద 4కోట్ల టన్నుల నిల్వలు ఉన్నాయని చెబుతోంది. విద్యుత్‌ సంక్షోభం ఉండబోదని, బొగ్గు అవసరమైన రాష్ట్రాలు.. కేంద్రానికి తెలియజేయాలని సూచించింది.

తమ రాష్ట్రాల్లో బొగ్గు కొరత ఉందని మహారాష్ట్ర, రాజస్థాన్‌, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు కేంద్రానికి తెలియజేశాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లోని థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లలో ఉత్పత్తి తగ్గిపోవడంతో విద్యుత్‌ కొరత ఏర్పడుతోంది. వారానికి రెండుసార్లు బొగ్గు నిల్వలపై కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇతర మంత్రులు గ్రూప్‌ చర్చిస్తోంది.  రానున్న మూడు రోజుల పాటు రోజుకు 16 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేస్తామని బొగ్గు మంత్రిత్వ శాఖతో పాటు కోల్‌ ఇండియా లిమిటెడ్‌ స్పష్టం చేశాయి. ఆ తర్వాత నుంచి 17లక్షల మెట్రిక్‌ టన్నులను సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తామని చెబుతున్నాయి.

బొగ్గు కొరత కారణంగా దేశ వ్యాప్తంగా 20 థర్మల్‌ పవర్‌ స్టేషన్లను అధికారులు మూసివేశారు. మూసివేసిన ప్లాంట్ల జాబితాలో అత్యధికంగా మహారాష్ట్రలో 13 ఉండగా, కేరళలో 4, పంజాబ్‌లో మూడు ఉన్నట్టు తెలుస్తున్నది. మరోవైపు, రాష్ట్రంలోని విద్యుత్తు ప్లాంట్లలో బొగ్గు నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయని, వెంటనే బొగ్గును సరఫరా చేయాలని బీజేపీ పాలిత రాష్ట్రం కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం తాజా పరిస్థితికి అద్దం పడుతున్నది. బొగ్గు సంక్షోభం మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌, ఢిల్లీ, రాజస్థాన్‌, ఆంధ్రప్రదేశ్‌ను కూడా వేధిస్తున్నది.

రాష్ట్రంలో బొగ్గు కొరత కారణంగా విద్యుత్తు ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో విద్యుత్తు కోతలు అనివార్యం కావొచ్చు. కాబట్టి, ప్రజలు అనవసరంగా విద్యుత్తును వృథా చేయకుండా సహకరించగలరు అని అస్సాం పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ స్థానిక వార్త పత్రికల్లో ప్రకటనలను ఇచ్చింది.

Also Read : Coal Crisis AP : ఏపీలో కరెంటు కోతలు..టైమింగ్స్ ఇవే
దేశవ్యాప్తంగా విద్యుత్తు ప్లాంట్లలో క్లిష్టపరిస్థితులు నెలకొన్నాయని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్తు కోతలతో రాజధానిలో అత్యవసర స్థితి రాకుండా ఉండేందుకు తాము అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. నగరంలో  విద్యుత్తు సరఫరాను 50 శాతం తగ్గిస్తూ ఎన్టీపీసీ నిర్ణయం తీసుకుందని ఢిల్లీ విద్యుత్తు మంత్రి సత్యేందర్‌ జైన్‌ తెలిపారు. దీంతో ఎక్కువ ధరకు విద్యుత్తును కొనుగోలు చేయాల్సి వస్తున్నదన్నారు. సంక్షోభ నివారణకు కేంద్రం వీలైనంత తొందరగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

మరో వైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా విద్యుత్ కోతలు విధించేందుకు ప్రభుత్వం సిధ్ధమయ్యింది. ప్రతిరోజు రాత్రి 6 గంటలనుంచి 10-30 గంటలవరకు విద్యుత్ కోతలు ఉండొచ్చని… ప్రజలను ముందస్తుగా సిధ్దం చేస్తున్నారు. దీనిపై ఒకటి రెండురోజుల్లో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Also Read : AP Coal shortage : బొగ్గు కొరత తీవ్రంగా ఉంది – బాలినేని

మరోపక్క, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో బొగ్గు కొరతకు పాత బకాయిలు పేరుకు పోవడమూ ప్రధాన కారణాల్లో ఒకటని కేంద్ర నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గనుల నుంచి బొగ్గు కొంటున్న విద్యుత్‌ కేంద్రాల యాజమాన్యాలు వందల కోట్ల రూపాయలు బాకీ పడ్డాయి. ఒక్క సింగరేణి గనులకే 5 రాష్ట్రాల యాజమాన్యాలు 5 వేల కోట్ల రూపాయల వరకూ బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు సమాచారం. దేశంలో కోల్‌ ఇండియా సహా పలు బొగ్గు గనులకు రావాల్సిన బకాయిలు వేల కోట్ల రూపాయలకు చేరినట్లు అంచనా. బకాయిలు పెరగడం వల్ల విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు సరఫరాను గనులు తగ్గించాయి.

దేశంలో రోజుకు 400 కోట్ల యూనిట్ల విద్యుత్‌ వినియోగం జరుగుతోంది. అందులో 65 నుంచి 70 శాతం అవసరాలను థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలే తీర్చుతున్నాయి. లాక్‌డౌన్‌ తర్వాత విద్యుత్‌ వినియోగం పెరగడంతో సమస్య ఉత్పన్నమైనట్టు చెబుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే.. ఈసారి బొగ్గు దిగుమతులు తగ్గాయి. కానీ, బొగ్గు ధర మాత్రం పెరిగింది.

మరోపక్క, ఉత్తరప్రదేశ్‌, కేరళ, పంజాబ్‌ రాష్ట్రాల్లో విద్యుత్‌ కోతలు తీవ్రమయ్యాయి. రోజుకు నాలుగైదు గంటలు విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. దీనిపై ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోనూ పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి. విద్యుత్‌ సమస్య తీవ్రమైందని సీఎం కేజ్రీవాల్‌ చెబుతున్నారు.

గుజరాత్‌, పంజాబ్‌, రాజస్థాన్‌, ఢిల్లీ, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రానికి సమాచారాన్ని చేరవేశాయి. పంజాబ్‌ అయితే ఏకంగా యూనిట్‌ 14 రూపాయల 46 పైసల చొప్పున 1500 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసింది. దేశంలో ఎక్కడికక్కడ విద్యుత్‌ ప్లాంట్లు మూతపడుతున్నాయి. పవర్‌ ఉత్పత్తిని నిలిపేస్తున్నాయి. దీంతో సమస్య తీవ్రమవుతోంది.