Smart Meters : తెలంగాణలో ప్రీపెయిడ్‌ విద్యుత్‌ మీటర్లు

తెలంగాణలో విద్యుత్ స్మార్ట్ మీటర్ల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇంటింటికీ ప్రీపెయిడ్‌ కరెంట్‌ మీటర్లు బిగించేందుకు విద్యుత్‌ శాఖ సన్నద్ధమవుతోంది.

Smart Meters : తెలంగాణలో ప్రీపెయిడ్‌ విద్యుత్‌ మీటర్లు

Meter

Prepaid electricity meters : తెలంగాణలో విద్యుత్ స్మార్ట్ మీటర్ల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇంటింటికీ ప్రీపెయిడ్‌ కరెంట్‌ మీటర్లు బిగించేందుకు విద్యుత్‌ శాఖ సన్నద్ధమవుతోంది. ముందుగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో అమర్చాలని నిర్ణయించింది. ఇందుకు అయ్యే వ్యయంపై ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. విద్యుత్‌ స్మార్ట్‌ మీటర్లు ఆర్థికంగా భారమని భావిస్తున్న సర్కార్‌.. దీనికి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారం కోరుతోంది.

కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ రంగంలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా స్మార్ట్‌ మీటర్లను తీసుకొస్తోంది. వాటితో విద్యుత్‌ ప్రసార, పంపిణీ, వాణిజ్య నష్టాలు తగ్గుతాయని భావిస్తోంది. ఇప్పటివరకు మనం వాడుకున్న కరెంట్‌కు బిల్లు కడుతున్నాం. చెల్లించడంతో కొంత జాప్యం జరిగినా కరెంట్‌ సరఫరా నిలిచిపోదు. స్మార్ట్‌ మీటర్లు వచ్చిన తర్వాత ముందుగానే డబ్బు కట్టి విద్యుత్‌ వాడుకోవాల్సి ఉంటుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రీపెయిడ్‌ మీటర్లు బిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
Cyclone : గులాబ్ గుబుల్, తుపాన్ ముప్పు..సాయంత్రం తీరం దాటే అవకాశం

ముందుగా హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో 28 వేల 800 స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆఫీసులన్నింటికీ 2023 డిసెంబర్‌లోగా స్మార్ట్‌ మీటర్లు బిగించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. 2025 మార్చిలోగా వ్యవసాయ రంగం మినహా అన్నింటికీ ప్రీపెయిడ్‌ మీటర్లు అమర్చాలని నిర్ణయించింది. స్మార్ట్‌ మీటర్ల కొనుగోలుకు అయ్యే వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు వేస్తోంది.

స్మార్ట్‌ కరెంట్‌ మీటర్లు బిగించడం భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. ఈ సంస్కరణల అమలుకు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాకారం తప్పనిసరి అని తెలంగాణ సర్కార్‌ చెబుతోంది. భారీ సబ్సిడీ ఇస్తేనే ఇది సాధ్యమంటోంది. కేంద్ర ప్రభుత్వం 15 శాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 50 నుంచి 60 శాతం ఇవ్వాలని కోరుతోంది. రాష్ట్రంలో కోటి 20 లక్షల పైగా గృహ విద్యుత్ కనెక్షన్లు వున్నాయి. వాటి అన్నింటికీ స్మార్ట్ మీటర్లు బిగించడానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తోంది.

Dasara 2021 : జోగులాంబలో శరన్నవరాత్రి వేడుకలు

ఫ్రీ పెయిడ్‌ కరెంట్‌ మీటర్లును సెల్‌ఫోన్లు, డీటీహెచ్‌ మాదిరిగా ఆన్‌లైన్‌లో రీచార్జ్‌ చేసుకునేలా రూపొందించారు. ముందుగా ప్రీపెయిడ్‌ కార్డు తీసుకోవాలి. దానిని మీటర్లో అమర్చితే విద్యుత్‌ సరఫరా అవుతుంది. బ్యాలెన్స్‌ ఎంత ఉందో ముందుగానే తెలుసుకుని రీచార్జ్‌ చేయించుకుంటే ఇబ్బంది ఉండదు. లేకపోతే విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుంది. సామాన్య ప్రజలకు సమయానికి చేతిలో సొమ్ము లేక రీచార్జ్‌ చేసుకోలేకపోతే చీకట్లో మగ్గాల్సిందే.

కరెంటును పొదుపుగా వాడుకునేందుకు ప్రీపెయిడ్‌ మీటర్లు దోహదం చేస్తాయి. ఉమ్మడి ఏపీలో ప్రసార, పంపిణీ, వాణిజ్య నష్టాలు 18.5 శాతం ఉండేవి. ప్రస్తుతం తెలంగాణలో ఆ నష్టాలు 10 శాతానికి తగ్గినట్టు అధికారులు చెబుతున్నారు. మరోవైపు స్మార్ట్‌ మీటర్లతో పెద్దగా ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు బిగించిన స్మార్ట్‌ మీటర్ల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని అధికారులు చెబుతున్నారు.