హత్రాస్ కేసులో కీలక పరిణామం

హత్రాస్ కేసులో కీలక పరిణామం

CBI Says Hathras Victim Was Gang-Raped, Killed దేశవ్యాప్తంగా సంచలనం రేపిన హత్రాస్‌ లో దళిత యువతి అత్యాచారం, హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితురాలిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నలుగురు యువకులపై శుక్రవారం(డిసెంబర్-18,2020)సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేసింది.

బాధిత యువతి చనిపోయిన మూడు నెలల తర్వాత ఇవాళ సీబీఐ నలుగురు నిందుతులపై చార్జిషీట్‌ దాఖలు చేసింది. బాధితురాలిని చిత్రహింసలకు గురిచేసి మృతికి కారణమైన నిందితులపై SC/ST చట్టం, సామూహిక అత్యాచారం కింద అభియోగాలు నమోదు చేసింది. హత్రాస్ లోని కోర్టులో సీబీఐ తన చార్జిషీట్‌ ఫైల్ చేసింది.

కాగా,ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్‌ లో సెప్టెంబర్‌- 14న 19 ఏళ్ళ దళిత యువతిపై ఆధిపత్య వర్గానికి చెందిన నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. తల్లితో కలిసి పొలంలో గడ్డి కోస్తున్న బాధితురాలిని లాక్కెళ్లి చిత్ర హింసలకు గురిచేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. యువతి నాలుక కోసి, వెన్నెముక విరిచి రాక్షసంగా వ్యవహరించారు.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితురాలికి తొలుత అలీఘర్‌లో ట్రీట్మెంట్ అందించినా ఫలితం లేకపోవడంతో, ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్‌ హాస్పిటల్ కి తరలించారు.

పక్షవాతంతో పాటు శరీరంలోని కీలక అవయవాలు తీవ్రంగా దెబ్బతినడంతో రెండు వారాలు చిత్రవధ అనుభవించిన బాధితురాలు మృత్యువుతో పోరాడుతూ సెప్టెంబర్‌ 29న తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఇక అదేరోజు అర్థరాత్రి కుటుంబసభ్యులకు కూడా సమాచారం అందించకుండా పోలీసులే బాధితురాలి శవాన్ని దహనం చేయడం తీవ్రవిమర్శలకు దారితీసింది.

దేశవ్యాప్తంగా సంచలన రేకెత్తించిన ఈ ఘటనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో సెప్టెంబరు 30న యోగి ఆదిత్యనాథ్‌ సర్కారు.. ఈ కేసు విచారణకై తొలుత ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఆ తర్వాత సీబీఐకి అప్పగించింది. హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై అక్టోబర్-13న సీబీఐ విచారణ ప్రారంభించింది. సీబీఐ విచారణను అలహాబాద్‌ హైకోర్టు పర్యవేక్షిస్తోంది.