ఇండియాను వదలని కరోనా : 4 వేల 281 కేసులు..24 గంటల్లో 32 మంది మృతి

  • Published By: madhu ,Published On : April 7, 2020 / 02:56 AM IST
ఇండియాను వదలని కరోనా : 4 వేల 281 కేసులు..24 గంటల్లో 32 మంది మృతి

ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 2020, ఏప్రిల్ 06వ తేదీ సోమవారం రికార్డు స్థాయిలో 704 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా తొలి కేసు నమోదైన తర్వాత ఈ స్థాయిలో కేసులు రిజిస్టర్ కావడం దేశంలో ఇదే తొలిసారి. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4వేల 281కి పెరిగింది. దేశంలోని కరోనా పాజిటివ్ కేసులకు ఢిల్లీ నిజాముద్దీన్ ప్రార్థనలు అధిక‌ ప్రభావం చూపాయి.

దేశంలోని మొత్తం కేసుల్లో ప్రస్తుతం 3వేల 851 యాక్టివ్‌గా ఉన్నాయి. 318 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 32 మరణాలు సంభవించాయి. ఇప్పటివరకు 111 మంది మరణించగా.. మూడింట ఒక వంతు మరణాలు నిన్ననే చోటుచేసుకున్నాయి. నిజాముద్దీన్ మ‌ర్కజ్‌కు వెళ్లిన త‌గ్లిబి జ‌మాత్ స‌భ్యుల‌తో పాటు, వారితో స‌న్నిహితంగా మెదిలిన 25వేల మందిని కేంద్ర ప్రభుత్వం క్వారంటైన్‌కు త‌ర‌లించింది.

జ‌మాత్ స‌భ్యులు బ‌స చేసిన హ‌ర్యానాలోని ఐదు గ్రామాలను నిర్బంధంలో ఉంచారు. దేశంలో ఇప్పటివరకు న‌మోదైన కేసుల్లో 14వందల 45 కేసులు త‌గ్లిబి జ‌మాత్ స‌భ్యుల‌కు చెందినవే. మ‌ర్కజ్ మ‌సీదు కార్యక్రమానికి మొత్తం 2వేల 83మంది విదేశీ జ‌మాత్ స‌భ్యులు హాజ‌రైన‌ట్లు గుర్తించ‌గా… అందులో 1750 మందిని బ్లాక్‌లిస్టులో పెట్టింది ప్రభుత్వం. జ‌మాత్‌కు అత్యధికంగా గుజ‌రాత్ నుంచి 15వందల మందికి పైగా హాజ‌ర‌వగా… తెలంగాణ నుంచి 1089 ఢిల్లీకి వెళ్లి వ‌చ్చిన‌ట్లు గుర్తించారు. 

దేశ రాజధాని ఢిల్లీలో తాజాగా 20 కేసులు నమోదు కావడంతో కేసుల సంఖ్య 525కు చేరింది. వాటిలో తబ్లిగీ జమాతే కేసులు 10 ఉన్నాయి. గత 24 గంటల్లో ఢిల్లీలో కరోనాతో ఒకరు మృతిచెందడంతో… అక్కడ మృతుల సంఖ్య ఏడుకు చేరింది. మరో 25 మంది పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. 

ఉత్తర‌ప్రదేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 300 మార్కు దాటింది. నిన్న కొత్తగా మ‌రో 27 క‌రోనా కేసులు న‌మోదు కావ‌డంతో మొత్తం కేసుల సంఖ్య 305కు చేరింది. అయితే కొత్తగా క‌రోనా బారిన‌ప‌డ్డ 27 మందిలో 21 మంది ఢిల్లీలో జ‌మాత్ సమావేశానికి హాజ‌రైన వారేన‌ని యూపీ హోంశాఖ తెలిపింది. యూపీలో ఇప్పటివ‌ర‌కు మూడు మ‌ర‌ణాలు సంభ‌వించగా… వారిలో బ‌స్తి, మీర‌ట్‌, వార‌ణాసికి చెందిన వారు ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. మ‌రో 21 మంది వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివ‌ర‌కు ఇంకా 81 మంది వివిధ ఆస్పత్రుల్లోని ఐసోలేష‌న్ సెంట‌ర్లలో వైద్యుల ప‌ర్యవేక్షణ‌లో ఉన్నారు.

మ‌హారాష్ట్రలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వైరస్ విజృంభిస్తుండటంతో ఆ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంత‌కూ పెరిగిపోతోంది. తాజాగా 87 కేసులు నిర్ధారణ కావడంతో మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 868కి చేరింది. కొవిడ్‌-19 కారణంగా దేశంలో 111మంది మరణించగా వీరిలో అత్యధికంగా 52మంది మహారాష్ట్రలోనే చనిపోయారు. కేవలం ఒక్క ముంబైలోనే 190పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. అటు పూణెలోనూ క‌రోనా తీవ్రత అధికంగా ఉంది.

దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని వోక్‌హార్ట్‌ హాస్పిటల్‌లో పనిచేస్తున్న ముగ్గురు డాక్టర్లు, 26 మంది నర్సులకు కరోనా వైరస్‌ సోకింది. దీంతో ఆ ఆస్పత్రిని ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ సీజ్‌ చేసింది. వారందరికి టెస్టులు నిర్వహించి నెగెటివ్‌ వచ్చేవరకు ఎవరూ బయటకు రాకూడదని అధికారులు ఆదేశాలు జారీచేశారు. హాస్పిటల్‌ యాజమాన్యం సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో  300 మంది సిబ్బందిని ఇప్పటికే క్వారంటైన్‌కు తరలించారు. గతనెల 20న ఇద్దరు కరోనా అనుమానితులను వోక్‌హార్ట్‌ ఆస్పత్రికి తరలించారు. వారిని సాధారణ ఐసీయూ వార్డులోనే ఉంచడంతోపాటు… సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో వారి బాగోగులను చూసుకుంటున్న ఇద్దరు నర్సులకు గతనెల 28న కరోనా పాజిటివ్‌ అని తేలింది. క్రమంగా 26 మంది నర్సులు, ముగ్గురు డాక్టర్లు ఈ వైరస్‌ బారిన పడ్డారు.(India Lockdown : జూన్‌ 3వ వారం వరకు లాక్‌డౌన్‌ కొనసాగింపు?)

మ‌ధ్యప్రదేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌న కొన‌సాగుతూనే ఉంది. రోజురోజుకు పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు  256 పాజిటివ్ కేసులు నమోదవగా… 15మంది మృతిచెందారు. ఇండోర్‌లో అత్యధికంగా 9 మంది, ఉజ్జయినిలో ఇద్దరు, ఖ‌ర్గోని, చింద్వారాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. తాజాగా భోపాల్‌లో తొలి కరోనా మరణం సంభవించింది. 

దేశంలో కరోనా బాధితుల్లో 47 శాతం కేసులు 40 ఏళ్లలోపు వారని… 34 శాతం కేసులు 40 నుంచి 60 ఏళ్లలోపు వారని కేంద్రం ప్రకటించింది. మొత్తం మరణాల్లో 63 శాతం మృతులు 60 ఏళ్లు పైబడినవారేనని చెప్పింది. వైరస్‌ బారిన పడేవాళ్లలో 76 శాతం పురుషులు, 24 శాతం మహిళలు ఉన్నారని, మరణాల్లోనూ 73 శాతం పురుషులు, 27 శాతం మహిళలు  ఉన్నారని తెలిపింది.