జ్యుడిషీయల్ కస్టడీ పొడిగింపు : మరో 14 రోజులు జైల్లోనే చిదంబరం 

  • Published By: sreehari ,Published On : October 17, 2019 / 01:16 PM IST
జ్యుడిషీయల్ కస్టడీ పొడిగింపు : మరో 14 రోజులు జైల్లోనే చిదంబరం 

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం జ్యుడిషియల్ కస్టడీని ప్రత్యేక కోర్టు పొడిగించింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) చిదంబరాన్ని మరో 14 రోజుల వరకు జ్యుడిషియల్ కస్టడీకి కోరింది. ఇదే కేసులో సెప్టెంబర్ 5 నుంచి తీహార్ జైల్లో ఉన్న చిదంబరాన్ని బుధవారం ఈడీ మరోసారి అరెస్ట్ చేసి విచారించింది. అనంతరం ఆయన్ను కోర్టు ఎదుట హాజరుపరిచింది. 74ఏళ్ల చిదంబరాన్ని 14 రోజుల కస్టడీ కోరుతూ స్పెషల్ జడ్జీ అజయ్ కుమార్ ఎదుట ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. 

దీనిపై విచారించిన కోర్టు.. చిదంబరానికి ప్రొడక్షన్ వారెంట్ జారీ చేసింది. సీబీఐ జ్యుడిషియల్ కస్టడీ గురువారం (అక్టోబర్ 17) ముగియడంతో రిమాండ్ పిటిషన్ ను విచారణకు స్వీకరించింది. ఆగస్టు 21 నుంచి చిదంబరం సీబీఐ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ కేసులో దర్యాప్తు సంస్థ మే 2017లో చిదంబరంపై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. 

అప్పటి నుంచి తీహార్ జైల్లో ఉంటున్న చిదంబరాన్ని సిటీ కోర్టు అనుమతితో ఈడీ విచారించింది. పీఎంఎల్ఏ కేసు కింద ఆయనపై ఈడీ క్రిమినల్ కేసు నమోదు చేసింది. చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న సయమంలో ఐఎన్ఎక్స్ మీడియా గ్రూపుకు FIPBని ఆమోదించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ అవినీతి కేసులో చిదంబరంతో పాటు ఆయన కుమారుడు కార్తీ చిదంబరాన్ని పేరును కూడా సీబీఐ చార్జ్ షీటులో నమోదు చేయనుంది.