Mumbai Red Alert : ముంబైకి రెడ్ అలర్ట్.. మరో 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ముఖ్యంగా ముంబైని వానలు ముంచెత్తాయి.

Mumbai Red Alert : ముంబైకి రెడ్ అలర్ట్.. మరో 4 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

Mumbai Red Alert

Mumbai Red Alert : నైరుతి రుతుపవనాల ప్రభావంతో మహారాష్ట్రలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ముఖ్యంగా ముంబైని వానలు ముంచెత్తాయి. మంగళవారం, బుధవారం కురిసిన వర్షాలకు ముంబై, థానే నగరాలు తడిసిముద్దయ్యాయి. ముంబైలో జనజీవనం అతలాకుతలం అయింది.

కుండపోత వానలతో ముంబై మొత్తం జలమయమైంది. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు సూచనలు సైతం చేశారు అధికారులు. ఈ క్రమంలో ముంబైకి రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. వచ్చే నాలుగు రోజులు ముంబైలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ముంబై నగరంతోపాటు శివారు ప్రాంతాలు థానే, పాల్ఘార్, రాయ్ గడ్ జిల్లాల్లో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది.

వరదల కారణంగా ముంబైలో రైళ్లను సైతం రద్దు చేశారు. పాల్ఘార్‌లో వంతెన కూలింది. భారీ వర్షాలతో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు ప్రజలకు సూచించారు.

శాంతాక్రజ్ దగ్గర ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు కేవలం 6 గంటల్లో 164.8 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని ఐఎండీ తెలిపింది. దక్షిణ ముంబైలోని కొలాబా ప్రాంతంలో బుధవారం 32.2 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. నేతాజీ పాల్కర్ చౌక్, ఎస్వీ రోడ్, బహేరాంబాగ్ జంక్షన్, సక్కర్ పంచాయతీ చౌక్, నీలం జంక్షన్, గోవాండి, హిందమాతా జంక్షన్, ఇక్బాల్ కమానీ జంక్షన్, ధారావి రెస్టారెంట్, ధారావి ప్రాంతాల్లో వర్షపు నీటితో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది.

ముంబై నగరంతో పాటే థానే, పాల్ఘార్, రాయ్ గడ్ జిల్లాలకు కూడా ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంబైతో పాటు ఆ మూడు జిల్లాల్లో ఈ నెల 13 వరకు భారీ వర్షపాతం నమోదవుతుందని హెచ్చరించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలను చేపట్టింది. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే భారీ వర్షాలపై సమీక్షలు జరిపారు. నీట మునిగిన ముంబై నగరంలో సహాయక చర్యల్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. మరో నాలుగు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయన్న ఐఎండీ హెచ్చరిక నేపథ్యంలో అన్ని జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఠాక్రే సూచించారు.