Jeevan Reddy: ప్రత్యర్థులు మారినా.. ఎన్నికల రణక్షేత్రాన్ని వీడని జీవన్‌రెడ్డి

గత ఎన్నికల్లో ఓటమితో జీవన్‌రెడ్డి రాజకీయ ప్రస్థానంపై ఎన్నో కామెంట్లు వినిపించాయి. చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి ఎలా నెట్టుకువస్తారన్నది ఆసక్తిరేపుతోంది.

Jeevan Reddy: ప్రత్యర్థులు మారినా.. ఎన్నికల రణక్షేత్రాన్ని వీడని జీవన్‌రెడ్డి

congress leader thatiparthi jeevan reddy political journey

Congress Leader Jeevan Reddy : 40 ఏళ్ల రాజకీయ జీవితం.. ఒకే ఒక నియోజకవర్గం.. ఆరుసార్లు ఎమ్మెల్యే.. ఓ సారి ఎమ్మెల్సీ.. తన రాజకీయ జీవితంలో ప్రత్యర్థులు మారేరా గాని.. ఆ నేత మాత్రం ఎప్పుడూ విరామం తీసుకోలేదు.. గెలుపు ఓటములు ఎలా ఉన్నా.. ఫలితం ఎలా వచ్చినా ఆయన పోటీ మాత్రం ఖాయం.. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ముగ్గురు ప్రత్యర్థులతో పోరాడిన ఆ నేత.. ఇప్పుడు ఆ ముగ్గురూ కలిసి తనను ఓడించాలని కంకణం కట్టుకుని తిరుగుతున్నా తగ్గేదేలే అంటూ ముందుకే కదలుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం..

నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో
తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డిది ప్రత్యేక స్థానం.. 1983లో రాజకీయాల్లోకి వచ్చిన జీవన్‌రెడ్డి.. నాలుగు దశాబ్దాలుగా అలుపన్నదే లేనివిధంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 1983 నుంచి ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎన్నికలోనూ పోటీచేస్తూ వస్తున్నారు. తొలిసారి టీడీపీ తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు జీవన్‌రెడ్డి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఉప ఎన్నికతో కలిపి మొత్తం పది సార్లు ఎన్నికలు జరిగితే ఈ పదిసార్లూ ఎన్నికల్లో పోటీచేశారు జీవన్‌రెడ్డి. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో తొలిసారి టీడీపీ నుంచి గెలిచిన జీవన్‌రెడ్డి.. 1985లో కాంగ్రెస్‌లో చేరారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన మాజీ మంత్రి రాజేశంగౌడ్ చేతిలో ఓడిపోయారు జీవన్‌రెడ్డి.

మళ్లీ 1989 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్‌రెడ్డి.. 1994లో టీడీపీ హవాలో మాజీ మంత్రి ఎల్‌.రమణపై ఓడిపోయారు. ఇక ఎల్.రమణ 1996లో ఎంపీగా ఎన్నికవడంతో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు జీవన్‌రెడ్డి. ఆ తరువాత 1999, 2004 ఎన్నికల్లో గెలిచిన జీవన్‌రెడ్డి.. 2009లో ఓడిపోగా, రాష్ట్ర విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో మళ్లీ గెలుపొందారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలవగా.. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొంది ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు జీవన్‌రెడ్డి. ఇక నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు జీవన్‌రెడ్డి. జగిత్యాల నియోజకవర్గం నుంచి ఆయనను మించిన నాయకుడు మరొకరు లేకపోవడంతో ఆయన పేరు ప్రకటన లాంఛనమే.

జగిత్యాల గడ్డపై ఒంటరి పోరాటం
నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో జీవన్‌రెడ్డి ముగ్గురు నేతల చేతిలోనే ఓడిపోయారు. ప్రత్యర్థులు మారారే కాని.. కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి మాత్రం ఎన్నికల రణక్షేత్రాన్ని ఎప్పుడూ వీడలేదు. జీవన్‌రెడ్డిపై గెలిచిన ముగ్గురు నేతల్లో ఇద్దరు మంత్రులుగా కూడా పనిచేశారు. అంతేకాదు ప్రస్తుత ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను మరోసారి గెలిపించేందుకు ఆ ఇద్దరు మాజీ మంత్రులు తెగ కష్టపడుతున్నారు. జీవన్‌రెడ్డి ప్రత్యర్థులు అంతా ఏకమై పనిచేస్తున్నా.. జీవన్‌రెడ్డి మాత్రం జగిత్యాల గడ్డపై ఒంటరి పోరాటమే చేస్తూ తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. జీవన్‌రెడ్డిని తొలిసారి ఓడించిన మాజీ మంత్రి రాజేశం గౌడ్.. ప్రస్తుతం తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక రెండోసారి ఓడించిన ఎల్.రమణ సిట్టింగ్ ఎమ్మెల్సీ కాగా.. ఈ ఇద్దరికి బీఆర్ఎస్ ఎలక్షన్ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించింది గులాబీ పార్టీ.

Also Read: కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోవడంలో బీజేపీ విఫలం.. రగిలిపోతున్న విజయశాంతి!

35 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే
ఇక సుదీర్ఘ రాజకీయ జీవితంలో జీవన్‌రెడ్డి ఆరుసార్లు ఎమ్మెల్యే.. ఒకసారి ఎమ్మెల్సీగా గెలుపొందడమే కాక ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. టీడీపీలో రాజకీయ జీవితం ప్రారంభించిన జీవన్‌రెడ్డి.. 35 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. ఆయన ముగ్గురు రాజకీయ ప్రత్యర్థులు ఇద్దరు టీడీపీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ప్రత్యర్థులు అంతా కట్టకట్టుకుని తన ఓటమికి ప్రయత్నిస్తున్నా.. శక్తినంతా కూడదీసుకుని వారిని దీటుగా ఎదుర్కొంటున్నారు జీవన్‌రెడ్డి. కాంగ్రెస్ టికెట్ల ప్రకటనతో సంబంధం లేకుండా ప్రచారం ప్రారంభించి ముగ్గురు ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నారు.

Also Read: కాంగ్రెస్‌లో ముగ్గురు నేతల మధ్య సీఎం సీటుకు ఒప్పందం.. పదవీ కాలాన్ని పంచేసుకున్నారు: కేటీఆర్

గత ఎన్నికల్లో ఓటమితో జీవన్‌రెడ్డి రాజకీయ ప్రస్థానంపై ఎన్నో కామెంట్లు వినిపించాయి. కానీ, తన వ్యూహంతో పట్టభద్ర ఎమ్మెల్సీగా గెలిచి రికార్డు సృష్టించారు. ఇక ఈ ఎన్నికల్లో లాస్ట్ చాన్స్ అంటూ ప్రచారం చేస్తూ దూసుకుపోతున్నారు. జీవన్‌రెడ్డి జోరును నిలువరించేందుకు బీఆర్‌ఎస్ అన్ని రకాల అస్త్రాలను ప్రయోగిస్తోంది. చావోరేవో తేల్చుకోవాల్సిన ఈ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి ఎలా నెట్టుకువస్తారన్నది ఆసక్తిరేపుతోంది.