Natural Farming Success Tips : ప్రకృతి వ్యవసాయంలో పట్టుసాధించిన రైతు

Natural Farming Success Tips
Natural Farming Success Tips : ఆహారం విషతుల్యం అవుతుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది. ఏం తినాలన్న దిగులే. అధిక దిగుబడుల కోసం పంటల సాగులో పెరిగిపోతున్న రసాయనాలు వినియోగం వల్ల పంటల నాణ్యత తగ్గడంతో పాటు మనుషులకు హాని జరుగుతుంది. రసాయనాలు లేకుండా ప్రకృతి సహజసిద్ధంగా పంటలు పండించుకుంటే రైతుకు మంచి ఆదాయం, ప్రజలకు మంచి ఆరోగ్యం. అదే లక్ష్యంతో ప్రకృతి వ్యవసాయం చేస్తూ.. లాభాల బాటలో పయనిస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు.
Read Also : Drone Spraying : పత్తి పంటకు డ్రోన్ తో మందుల పిచికారి
వ్యవసాయంలో ఎంత దిగుబడి సాధించాం.. అనేదానికంటే, పెట్టిన పెట్టుబడికి ఎంత లాభం పొందాం అనేది రైతుకు ప్రామాణికంగా వుండాలి. తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉత్పత్తిని అందిస్తున్న ప్రకృతి సాగు విధానాలు, వ్యవసాయంలో ఒక మంచి పరిణామంగా నిలవగా, ఆదాయాన్ని మరింత పెంచుకునే విధంగా, పంటల సాగులో రైతులు అనుసరిస్తున్న నూతన విధానాలు, సేద్యంపట్ల మరింత భరోసాను నింపుతున్నాయి. ఇలాంటి సాగు విధానాలతో తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు కృష్ణా జిల్లా, ఉంగుటూరు మండలం, ఇందుపల్లి గ్రామానికి చెందిన రైతు కోగంటి శ్రీరాంప్రసాద్.
రైతు శ్రీరాంప్రసాద్.. తనకున్న 15 ఎకరాల్లో 8 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఖరీఫ్ పంటగా వరి సాగుచేయడం.. రెండో పంటగా మినుము, పెసరను పండిస్తుంటారు. అయితే వరిలో కూడా తెలంగాణ సోనా అయిన ఆర్.ఎన్.ఆర్ 15048 (పదిహేను సున్నా నలబైఎనిమిది) రకాన్ని సాగుచేస్తున్నారు. ఈ పంటలకు ఎలాంటి రసాయన మందులను వాడటంలేదు.
కేవలం తనవద్ద ఉన్న పశువులనుండి వచ్చే వ్యర్థాలను పంటలకు వాడుతున్నారు. ముఖ్యంగా చీడపీడలకు స్థానికంగా దొరికే ఆకులను ఉపయోగించి కషాయాలను తయారుచేసి పిచికారి చేస్తున్నారు. పంటల నుండి వచ్చిన దిగుబడులను సొంతంగా మార్కెట్ చేస్తూ.. అధిక లాభాలను ఆర్జిస్తూ.. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ప్రకృతి వ్యవసాయానికి మించింది లేదు. రసాయనిక ఎరువులు, పురుగు మందులపై ఆధారపడి వ్యవసాయం చేస్తే.. పెట్టుబడులు పెరిగి గిట్టుబాటు కాని పరిస్థితులు దాపురించాయి. ఫలితంగా వ్యవసాయం చేసేందుకే రైతులు జంకుతున్నారు. ఈ పరిస్థితి నుంచి మళ్లీ మామూలు స్థితికి రావాలంటే ప్రకృతి వ్యవసాయమే మార్గం. మొదట కొంచె కష్టమైనా.. ఆతరువాత ప్రకృతి వ్యవసాయానికి భూమి అలవాటు పడుతుంది. పెట్టుబడులు, ఖర్చులు తగ్గి అధిక దిగుబడులు వస్తాయని నిరూపిస్తున్నారు రైతు శ్రీరాంప్రసాద్.
Read Also : Zero Budget Farming : జీరో బడ్జెట్ విధానంలో దేశీ వరి సాగు