24గంటల్లో 326 కరోనా కేసులు.. కొత్త స్ట్రెయిన్‌పై ప్రభుత్వం అలర్ట్

24గంటల్లో 326 కరోనా కేసులు.. కొత్త స్ట్రెయిన్‌పై ప్రభుత్వం అలర్ట్

Updated On : December 29, 2020 / 9:40 PM IST

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా.. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 50,794 కరోనా పరీక్షలు నిర్వహించగా, 326 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 8లక్షల 81వేల 599కి చేరింది. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి అనంతపురం, కృష్ణాలో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు చనిపోయారు. ఇప్పటివరకు కరోనాతో 7వేల వంద మంది చనిపోయారు.

గత 24గంటల్లో కరోనా నుంచి కోలుకుని 364మంది బయటకు రాగా.. ఇప్పటివరకు 8లక్షల 71వేల 116మంది డిశ్చార్జ్‌ అయ్యారు. ఏపీలో ప్రస్తుతం 3వేల 383 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్త వైరస్‌ స్ట్రెయిన్‌పై అప్రమత్తంగా ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

రాజమండ్రికి చెందిన మహిళకు మాత్రమే ఇప్పటికే స్ట్రెయిన్‌ వచ్చిందని స్పష్టం చేశారు అధికారులు. ఆమెతో సన్నిహితంగా ఉన్న కుమారుడికి నెగిటివ్‌ వచ్చిందని అధికారులు చెప్పారు. యూకే నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినవారు 1423 మంది కాగా, వారిలో 1406 మందిని ట్రేస్‌ చేసినట్లు అధికారులు చెబుతున్నారు.

ఇప్పటివరకు గుర్తించినవారిలో 12 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయ్యిందని అన్నారు. 1406 మందితో ప్రైమరీ కాంటాక్ట్‌ అయిన 6,364 మంది గుర్తించామని, వారందరికీ పరీక్షలు చేసినట్లు వైద్యాధికారులు చెప్పారు. ఇంకా 23మంది రిపోర్ట్‌లు రావలసి ఉందని చెప్పారు అధికారులు.