Amit Shah: ఏపీలోని పార్టీలతో బీజేపీ పొత్తులపై అమిత్ షా ఆసక్తికర కామెంట్స్
త్వరలోనే ఎన్డీయేలోకి కొత్త మిత్రులు వస్తున్నారని చెప్పారు. ఏపీలో పొత్తులు..

Amit Shah
Amit Shah: ఎకనామిక్ టైమ్స్ సదస్సులో కేంద్ర మంత్రి అమిత్ షా ఏపీ రాజకీయాలు, ఎన్డీయే పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే ఢిల్లీలో బీజేపీ అధిష్ఠానంతో సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వేర్వేరుగా చర్చలు జరిపిన విషయం తెలిసిందే.
దీనిపై అమిత్ షా స్పందిస్తూ… ఆంధ్రప్రదేశ్‍లో పొత్తులపై ఇప్పుడే ఏం మాట్లాడలేమని అన్నారు. త్వరలోనే ఎన్డీయేలోకి కొత్త మిత్రులు వస్తున్నారని చెప్పారు. ఏపీలో పొత్తులు త్వరలోనే కొలిక్కి వస్తాయని అమిత్ షా అన్నారు. కుటుంబ పరంగా ప్యామిలీ ప్లానింగ్ బాగుంటుందని, కానీ రాజకీయంగా ఎంత పెద్దకూటమి ఉంటే అంత మంచిదని తెలిపారు.
తమ మిత్రులను తామెప్పుడూ బయటకు పంపించలేదని అమిత్ షా అన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని పార్టీలు బయటకు వెళ్లి ఉండవచ్చని చెప్పారు. పంజాబ్‌లో అకాలీదళ్‌తో చర్చలు కొనసాగుతాయని అమిత్ షా వివరించారు.
కాగా, బీజేపీ అధిష్ఠానంతో చంద్రబాబు నాయుడు చర్చలు జరిపిన వేళ.. జగన్ కూడా ఢిల్లీకి వెళ్లడం ఆసక్తి రేపింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఎవరితో కలిసి వెళ్తుందన్న ఉత్కంఠ నెలకొంది.
Also Read: ఏపీ ఎన్నికల వేళ.. పవన్ కల్యాణ్‌కు హరిరామ జోగయ్య లేఖ