రాయలసీమను కృష్ణా నీటితో తడుపుతాం..పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన

CM Jagan laid the foundation stone for development works : రాయలసీమను కృష్ణా నీటితో తడుపుతామని సీఎం జగన్ అన్నారు. రాయలసీమ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తున్నామని తెలిపారు. పోతిరెడ్డిపాడు పూర్తైతే సీమతోపాటు నెల్లూరు, చెన్నైకి నీరు అందుతుందన్నారు. శ్రీశైలంలో 881 అడుగుల వరకు నీరు ఉంటేనే పోతిరెడ్డిపాడుకు 44 వేల క్యూసెక్కుల నీటిని మళ్లించేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగులకు పడిపోతే 7 వేల క్యూసెక్కులకే అవకాశం ఉంటుందన్నారు. అందుకే రిజర్వాయర్ల కెపాసిటీ పెంచుతున్నామని తెలిపారు.
గురువారం (డిసెంబర్ 24, 2020) సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించారు. పులివెందులలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.3,115 కోట్లతో గండికోట-సీబీఆర్, గండికోట-పైడిపాలెం లిఫ్ట్ స్కీమ్ కు శంకుస్థాపన చేశారు. రూ.1,256 కోట్లతో మైక్రో ఇరిగేషన్, రూ.34 కోట్ల 20 లక్షలతో పులివెందులలో 12 ఎకరాల విస్తీర్ణంలో నూతన ఆర్టీసీ బస్ స్టేషన్ మరియు డిపో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఇవాళ శంకుస్థాపన చేస్తున్న ప్రాజెక్టు గండికోట నుంచి 40 రోజుల్లో చిత్రావతికి మరియు పైడిపాలెం జలాశయాలు నింపేందుకు రూ.3 వేల కోట్లతో నూతనంగా లిఫ్ట్ స్కీములు ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు. ఈ స్కీముల ద్వారా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు రోజుకు 4 వేల క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఇస్తున్నది రెండు వేల క్యూసెక్కుల నీరని.. మరో 2 వేల క్యూసెక్కుల నీటి విడుదలకు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు.
పైడిపాలెం జలాశయానికి 2 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోతల చేస్తామని చెప్పారు. ప్రస్తుతం వెయ్యి క్యూసెక్కుల నీరు ఎత్తిపోతల జరుగుతుందని..దీన్ని రెండు వేల క్యూసెక్కులకు పెంచుతూ శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పులివెందుల బ్రాంచ్ కెనాల్, సీబీఆర్ కుడి కాలువ మరియు జీకేఎల్ ఐకు సంబంధించిన లక్షా 38 వేల ఎకరాల భూమిని, పులివెందులలో రూ.1,256 కోట్లతో మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. వీటికి సంబంధించిన జ్యుడీషియల్ ప్రివ్యూ కూడా ఇప్పటికే అయిపోయిందన్నారు.
ఎల్లుండి 26వ తేదీన టెండర్లను అప్ లోడ్ కూడా చేయడం జరుగుతుందన్నారు. మార్చి కల్లా పనులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టులకు దాదాపుగా 4300 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు. రూ.125 కోట్లతో వైద్య కళాశాల ఏర్పాటుకు భూసేకరణ చేశామని, ఫిబ్రవరి కల్లా వైద్య కళాశాల పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
పులివెందుల నియోజకవర్గానికి ఏమీ ఇచ్చినా రుణం తీర్చుకోలేనని జగన్ చెప్పారు. ఇక్కడి ప్రజలు తనను సొంత కొడుకులా, బిడ్డలా అప్యాయత చూపిండంలో ఏ రోజు తక్కువ చేయలేదన్నారు. కాబట్టి ఇక్కడి ప్రజలకు ఎంత చేసినా తక్కువేనని మరోసారి స్పష్టం చేశారు.