చంద్రబాబుకు కౌంటర్ : ఏపీలో మోడీ అమిత్ షా టూర్

ఢిల్లీ: నరేంద్ర మోడీ, అమిత్ షాల ఏపీ పర్యటన ఖరారు అయ్యింది. ప్రధానమంత్రి మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఫిబ్రవరిలో ఏపీలో పర్యటించనున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ఫిబ్రవరి 10న గుంటూరు, 16న విశాఖపట్నంలో మోడీ పర్యటిస్తారని కన్నా చెప్పారు. ఫిబ్రవరి 4న విజయనగరం, 21న రాజమండ్రి, 26న ఒంగోలులో అమిత్‌షా పర్యటించనున్నారని ఆయన తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే కేంద్రం ఏపీకి మొండి చెయ్యిఇచ్చింది, ఏపీని మోసం చేసిందని, అవకాశం వచ్చినప్పుడల్లా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఫిబ్రవరి 1 నుంచి 13 వ తేదీ వరకు వివిధ రూపాలలో రాష్ట్రం తరపున నిరసనలు వ్యక్తం చేయాలని బుధవారం ప్రణాళికలు రూపోందించారు. 11న ఢిల్లీలో ఆందోళన చేపట్టి, 12న రాష్ట్రపతి దగ్గరకు అఖిల పక్ష నేతలను తీసుకువెళ్ళనున్నారు. కాగా ….ఏపీలో మోడీ, అమిత్ షా పర్యటనలో భాగంగా కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, పధకాలు వివరించే అవకాశం ఉంది.