జిల్లాల బాట పట్టనున్న మాజీ సీఎం వైఎస్ జగన్.. ఎప్పటి నుంచి అంటే..

ఎక్కడ అన్యాయం జరిగినా వీడియో తీసి అప్ లోడ్ చేయాలని సూచించారు.

జిల్లాల బాట పట్టనున్న మాజీ సీఎం వైఎస్ జగన్.. ఎప్పటి నుంచి అంటే..

Updated On : November 29, 2024 / 11:22 PM IST

Ys Jagan Districts Tour : ఏపీ మాజీ సీఎం జగన్ జిల్లాల బాట పట్టనున్నారు. సంక్రాంతి తర్వాత పార్లమెంట్ యూనిట్ గా జిల్లాల్లో పర్యటిస్తానని జగన్ తెలిపారు. ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే ఉంటానని, రెండు రోజుల పాటు కార్యకర్తలతో మమేకం అవుతానని చెప్పారు. ప్రతీ గ్రామంలో టీడీపీ, చంద్రబాబును ప్రశ్నించాలన్న జగన్.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఏమైందని నిలదీయాలని దిశానిర్దేశం చేశారు.

గ్రామ స్థాయి నుంచి ఎంపీ వరకు ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్ ఉండాలన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా వీడియో తీసి అప్ లోడ్ చేయాలని సూచించారు. జనవరిలోగా పార్టీలోని వివిధ విభాగాలకు నియామకాలు పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నారు.

”ఈ సంక్రాంతి తర్వాత నేను కూడా జిల్లాల బాట పడతాను. జనవరి నెలాఖరు నుంచి మొదలు పెడతాను. ప్రతి బుధవారం, గురువారం నేను కూడా జిల్లాల్లోనే పడుకుంటాను. ప్రతి పార్లమెంట్ ను ఒక యూనిట్ కింద తీసుకుని నేనే అక్కడికి వచ్చి నేనే అక్కడ బస చేస్తాను. బుధవారం అంతా మూడు నియోజకవర్గాల కార్యకర్తలతో, గురువారం మరో నాలుగు నియోజకవర్గాల కార్యకర్తలతో నేనే మమేకం అవుతా. పూర్తిగా కార్యకర్తలకే కేటాయింపు చేసే కార్యక్రమాలు చేస్తాం.

అక్కడే ఉంటూ, కార్యకర్తలతో మమేకం అవుతూ, కార్యకర్తలతో తోడుగా ఉండే కార్యక్రమం, కార్యకర్తలకు దగ్గరయ్యే కార్యక్రమం కూడా చేస్తాం. అందుకు తగ్గట్లే పేర్లు పెట్టాం. కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం పేర్లతో ముందుకు వెళ్తాం. ఆ ప్రోగ్రామ్ ముఖ్య అజెండా.. మండల స్థాయి కల్లా కమిటీలు ఏర్పాటు చేయాలని మా వాళ్లకు చెప్పాం. పార్టీ పటిష్టత కోసం కమిటీలు ఏర్పాటవుతున్నాయి. నా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే సమయానికి మండల స్థాయిలో అన్ని కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పాను. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటవుతాయి” అని జగన్ చెప్పారు.

”మనలో పోరాటపటిమ సన్నగిల్లకూడదు. ప్రతిపక్షంలో ఉన్నాం.. కష్టాలుంటాయి, నష్టాలుంటాయి. కష్టకాలంలో ఉన్నప్పుడే మనకు పరీక్ష. ప్రతి ఒక్కరికి ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్ ఉండాలి. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా వీడియో తీసి అప్ లోడ్ చేయాలి” అని ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో సమావేశంలో జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read : భవిష్యత్తులో రాజధానిని మార్చే అవకాశం లేకుండా సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్..!