Heavy Rains : రైతన్నను ముంచిన అకాల వర్షాలు
ఆరుగాలం కష్టపడి పండించుకున్న పంట.. అకాల వర్షాలతో నాశనమవుతోంది. ఎంతో కష్టపడి పండించిన అన్నదాతలకు వడగళ్ల వాన కడగండ్లు మిగుల్చుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి.

Farmers Loss Due To Heavy Rains
Farmers Loss Due to Heavy Rains : ఆరుగాలం కష్టపడి పండించుకున్న పంట.. అకాల వర్షాలతో నాశనమవుతోంది. ఎంతో కష్టపడి పండించిన అన్నదాతలకు వడగళ్ల వాన కడగండ్లు మిగుల్చుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి.
రబీ వరి ఇప్పుడిప్పుడే చేతికి వస్తోంది. కొన్ని చోట్ల ధాన్యం నూర్చి కల్లాల్లో ఆరబెట్టుకున్నారు. కొందరు రైతులు అమ్ముకునేందుకు మార్కెట్ యార్డులకు తీసుకొచ్చారు. అకాల వర్షాలతో ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిచిపోయింది. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం వర్షం నీటి ఉధృతికి కొట్టుకుపోవడంతో రైతులు చేతులతో దేవాల్సిన పరిస్థితి. వడ్లు నీటిలో నానిపోవడంతో మొలకలు వచ్చే పరిస్థితి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదే జరిగితే ధాన్యం కొనేనాథులే ఉండరన్న ఆవేదన అన్నదాతల్లో కనిపిస్తోంది. పంటకు సాగుకు చేసిన ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని దిగులు చెందుతున్నారు రైతులు. కోతకు వచ్చిన వరిచేలు కడా నేలకొరిగిపోయాయి.
ప్రకాశం జిల్లాలో అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. గిద్దలూరు, కంభం, మార్కాపురం ప్రాంతాల్లో పడిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయ్. మిర్చి తడిచిపోతే.. వరి పొలాలు నేలకొరిగాయి. మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. కంది పంట దెబ్బతింది. టమాట తోటలకు నష్టం వాటిల్లింది. పంట చేతికి వచ్చే దశలో వర్షాలు పడటంతో సాగుకు చేసిన ఖర్చుల కూడా వచ్చే అవకాశంలేదని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. అటు పొలాలలతో పాటు పెనుగాలకు పూరిళ్లు నేలకూలాయి. దీంతో చాలా మంది నిరాశ్రయులయ్యారు. కంభం మండలం కందులాపురంలో భారీ వృక్షాలు కూకటివేళ్లతో పెకలించుకని నేలకూలాయి.
అనంతపురంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. అక్కడక్కడ చెట్లు, స్థంబాలు నేలకొరిగాయి. ఇటు విజయనగరం జిల్లా సాలూరులోనూ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. విశాఖ- రాయపూర్ జాతీయ రహదారిపై వాహన రాకపోకలు స్థంబించడంతో వాహనదారులు ఇబ్బందులుపడ్డారు.
తెలంగాణలో పలు ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలు.. ఎండ వేడి నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం ఇచ్చిన.. రైతులకు మాత్రం అపార నష్టాన్ని మిగిల్చాయి. సంగారెడ్డి, జహీరాబాద్, ఆందోల్, నర్సాపూర్‌లో చేతికొచ్చిన పంట చేజారిపోవడంతో .. రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఒక్కసారిగా వాన కుమ్మేయడంతో వరి, ఉల్లి, మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట నష్టాన్ని అంచనావేసి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు.
ఉమ్మడి వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్‌లో పలు చోట్ల వడగళ్ల వాన పడింది.. దీంతో కళ్లాల్లో ఉన్న ధాన్యం, మిర్చి, పసులు తడిసి ముద్దైంది.. మొక్కజొన్న నేలకొరిగింది.. పలు చోట్ల వరి ధాన్యం కొట్టుకుపోయింది.. మరోవైపు మామిడి కాయలు నేలరాలాయి. చేతికొచ్చిన పంట తడిసి ముద్దవ్వడంతో రైతులు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.. ఇదిలా ఉంటే మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.