ఏపీలో నామినేటెడ్ పోస్టుల జాతర జరిగేదెప్పుడు? ఎందుకీ ఆలస్యం..

నామినేటెడ్‌ పదవుల పందేరం మాత్రం డైలీ సీరియల్‌ ఎపిసోడ్‌లా ఎంతకీ ఎండ్‌ కార్డ్‌ పడకపోవడమే చర్చనీయాంశంగా మారింది.

ఏపీలో నామినేటెడ్ పోస్టుల జాతర జరిగేదెప్పుడు? ఎందుకీ ఆలస్యం..

Updated On : September 22, 2024 / 1:11 AM IST

Gossip Garage : కూటమి పార్టీల నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేటెడ్‌ పోస్టుల భర్తీ మరింత ఆలస్యం కానుందా? వంద రోజుల పాలన సందర్భంగా కొందరికి వరం ఇద్దామనుకున్న సీఎం చంద్రబాబు… అకస్మాత్తుగా తన నిర్ణయాన్ని ఎందుకు వాయిదా వేసుకున్నారు? ఈ నెలాఖరు నాటికైనా పదవుల పందేరం ఉంటుందా? ఆశావహుల ఆలోచనలేంటి? అధినేతల అంతరంగం ఎలా ఉంది? ఇంతకీ నామినేడెట్‌ జాతర జరిగేదెప్పుడు?

పదవుల పంపకంపై జాప్యం ఎందుకో…
ఏపీలో సూపర్‌ విక్టరీ కొట్టిన కూటమిలో నామినేటెడ్‌ పోస్టుల నియామకం ఆశలు రేకెత్తిస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఇవాళ… రేపు అన్నట్లు జరిగిన ప్రచారం… వంద రోజులైనా అమలులోకి రాలేదు. ఇక వంద రోజుల పండగ సందర్భంగానైనా అధినేత తమను కరుణిస్తారని ఆశించిన ఆశావహులపై మరో సారి నీళ్లు కుమ్మరించారు సీఎం చంద్రబాబు. మూడు పార్టీల కూటమిలో ఏ పార్టీకి ఎన్ని పదవులు అన్న విషయంపై క్లారీటీ వచ్చినా…. పదవుల పంపకంపై జాప్యం జరగడమే ఎవరికీ అంతుచిక్కడం లేదు.

పదవుల భర్తీ లేక లీడర్లు, క్యాడర్ లో అసంతృప్తి..
జూన్‌ 4న ఫలితాలు వస్తే.. అదే నెల 12న కూటమి ప్రభుత్వం కొలువు దీరింది. అయితే కూటమి భారీ విజయం వెనుక మూడు పార్టీల నేతలు, క్యాడర్‌ ఎంతో శ్రమపడ్డారు. వీరికి కృతజ్ఞతగా నామినేటెడ్ పదవులను ఇవ్వాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ నిర్ణయించారు. ఐతే ఆగస్టు వరకు ఆషాఢం, మంచి ముహూర్తాలు లేకపోవడంతో నియామకాలపై వాయిదా వేశారు. మంచి ముహూర్తాలు వచ్చిన తర్వాత కూడా భర్తీ లేకపోవడంతో క్యాడర్‌తోపాటు లీడర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అంటున్నారు.

ప్రభుత్వ ప్రకటన కోసం నరాల తెగే ఉత్కంఠతో ఎదురుచూపులు..
తొలుత టీటీడీతోపాటు పలు ఆలయాలు, దాదాపు 20 కార్పొరేషన్లకు పాలకవర్గాలను నియమిస్తారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. మూడు పార్టీల మధ్య ఈ విషయమై సమన్వయ సమావేశాలు కూడా జరిగాయి. మూడు పార్టీల నుంచి చైర్మన్లు, డైరెక్టర్ల పదవులు ఎవరికి ఇవ్వాలనే ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి. లిస్టు మొత్తం రెడీగా ఉన్నా విడుదల చేయడంలోనే జాప్యం జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఎవరికి ఏ పదవి అన్న విషయంపై ప్రభుత్వ పెద్దల్లో క్లారిటీ ఉన్నా, ఆశావహుల్లో మాత్రం సస్పెన్స్‌ కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో ఆశావహులు, వారి మద్దతుదారులు ప్రభుత్వ ప్రకటన కోసం నరాల తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

ఆ ప్రచారం ఎవరి అవకాశాలను దెబ్బతీస్తోందోననే టెన్షన్‌..
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంచి ముహూర్తం ఆగస్టు 16న ఉందని… ఆ రోజున నామినేటెడ్‌ పదవుల తొలి జాబితా విడుదల అవుతుందని ప్రచారం జరిగింది. ఆ డేట్‌ తర్వాత అలాంటి తేదీలు దాదాపు పది వరకు ప్రచారంలోకి వచ్చినా… పోస్టుల భర్తీపై ప్రభుత్వం ప్రకటన చేయలేదు. ఇదే సమయంలో పలానా పోస్టు… పలాన నేతకంటూ సోషల్‌ మీడియాలో రోజుకో లిస్టు ప్రచారంలోకి వస్తోంది. దీంతో కూటమి పార్టీల్లో గందరగోళం ఏర్పడుతోందంటున్నారు. పదవులు ఆశిస్తున్న నేతలు కూడా ఇలాంటి ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నట్లు అమరావతిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో ఇలాంటి ప్రచారం ఎవరి అవకాశాలను దెబ్బతీస్తుందోననే టెన్షన్‌ ఆశావహుల్లో ఎక్కువవుతోంది.

దాదాపు వంద వరకు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు..
రాష్ట్రంలో ముఖ్యమైన పది ఆలయాలు, దాదాపు వంద వరకు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు ఉన్నాయి. ఇవికాక రీజనల్‌ బోర్డులు, నియోజకవర్గ స్థాయిలోనూ కొన్ని పదవులు ఉన్నాయి. కానీ, ఏ స్థాయిలోనూ ఇప్పటివరకు నియామకం జరగలేదు. ఇటీవల రిటైర్డ్‌ ఐఏఎస్‌ కృష్ణయ్యకు మాత్రం కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌ పదవి కట్టబెట్టారు. ఐతే రాజకీయంగా ఆ పదవికి పెద్దగా మోజు లేకపోవడంతో పొలిటీషియన్స్‌ ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు.

టీటీడీ చైర్మన్‌గా కమ్మసామాజిక వర్గానికి చెందిన ఒకరి పేరు ఖరారు..!
టీటీడీ చైర్మన్‌, ఆర్టీసీ చైర్మన్‌ వంటి రాష్ట్రస్థాయి ప్రొటోకాల్‌ ఉన్న పదవులపై అందరిలో ఆసక్తి నెలకొంది. టీటీడీ చైర్మన్‌గా కమ్మసామాజిక వర్గానికి చెందిన ఒకరి పేరు దాదాపు ఖాయమైందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఆయనకు పోటీగా కొందరు ఎమ్మెల్యేలు సైతం రేసులోకి వచ్చినట్లు చెబుతున్నారు. ఇక ఆర్టీసీ చైర్మన్‌గా దేవినేని ఉమా పేరు ఖాయమైందని చెబుతున్నా… ప్రకటన మాత్రం రావడం లేదు.

Also Read : వైసీపీలో వలసలకు కారణం ఏంటి? సంక్షోభం నుంచి బయటపడేదెలా?

డైలీ సీరియల్‌ ఎపిసోడ్‌లా పదవుల పందేరం..
తొలుత దుర్‌ ముహూర్తాలు అని పెండింగ్‌ పెట్టగా, ఆ తర్వాత సర్వేల పేరిట కొన్నాళ్లు జాప్యం చేశారు.. అంతా కొలిక్కి వచ్చిందన్న సమయంలో విజయవాడ వరదలతో లిస్టు పెండింగ్‌లో పడిపోయింది. ఇక వరదలు శాంతించిన తర్వాత చంద్రబాబు కరుణిస్తారంటే ఇప్పుడు తిరుపతి లడ్డూ విషయంలో రాజకీయం వేడెక్కింది. ఈ పరిస్థితుల్లో అంతా సర్దుమణిగాకే పోస్టుల భర్తీ ఉంటుందంటున్నారు. మొత్తానికి నామినేటెడ్‌ పదవుల పందేరం మాత్రం డైలీ సీరియల్‌ ఎపిసోడ్‌లా ఎంతకీ ఎండ్‌ కార్డ్‌ పడకపోవడమే చర్చనీయాంశంగా మారింది.