AP Rain Alert : ఏపీకి మరోసారి రెయిన్ అలర్ట్.. రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో ఏపీ తడిసి ముద్దైంది. ఇది చాలదన్నట్టు మరోసారి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది.

AP Rain Alert : ఏపీకి మరోసారి రెయిన్ అలర్ట్.. రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు

Ap Rains

Updated On : November 16, 2021 / 9:06 PM IST

AP Rain Alert : ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో ఏపీ తడిసి ముద్దైంది. ఇది చాలదన్నట్టు మరోసారి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రెండు రోజులు(నవంబర్ 17, నవంబర్ 18) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంది.

కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఎల్లుండి దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి 40 కిమీ నుంచి 60 కిమీ వేగంతో గాలులు వీస్తాయని, ఎల్లుండి వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పొలం పనులు చేసుకునే రైతులు జాగ్రతలు తీసుకోవాలన్నారు.

ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో కుండపోత వానలు పడ్డాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కుండపోత వానలు అన్నదాతలకు నష్టాన్ని మిగిల్చాయి. చేతికి అందివచ్చిన పంటలు నీటమునగడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే నీట మునగడంతో కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయనే వార్తలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి.