రెయిన్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. నాలుగు రోజులు ఏపీలోని ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..
ఏపీలో వర్షాలు దంచికొట్టనున్నాయి. వచ్చే నాలుగు రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Rain Alert
AP Rain Alert: ఏపీలో వర్షాలు దంచికొట్టనున్నాయి. వచ్చే నాలుగు రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం గురువారం నాటికి అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రానున్న నాలుగు రోజులు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం పేర్కొంది. సముద్రం అలజడిగా మారనున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది.
రానున్న 24గంటల్లో ఉత్తరకోస్తాలో ఎక్కువ చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులతో కూడి భారీ వర్షాలు, 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఇవాళ (గురువారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్టణం, అనకాపల్లి, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వానలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు.