Minister Roja : సీఎం జగన్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే.. పవన్ కళ్యాణ్ అయినా, ఎవడినైనా పళ్లు రాలగొడతాం : మంత్రి రోజా
జనసేన-టీడీపీ పొత్తు హిట్ అయిందట.. ప్యాకేజీ విషయంలో మాత్రమే హిట్ అయ్యారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ వెళ్లి పవన్ కళ్యాణ్ ఏదో చెప్తారట.. పవన్ ను మెడపట్టి అమిత్ షా గెంటేస్తారని పేర్కొన్నారు.

Minister Roja warning Pawan Kalyan
Minister Roja Warn Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. పవన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సీఎం జగన్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే పవన్ కళ్యాణ్ అయినా, ఎవడికైనా పళ్లు రాలగొడతామని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ తన స్థాయికి మించి మాట్లాడితే ఎవ్వరు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ పిచ్చి పరాకాష్టకు చేరిందన్నారు. పవన్ పిచ్చికి జగనన్నతో చెప్పి ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం చేయిస్తామని ఎద్దేవా చేశారు.
దేనిలోనైనా పవన్ సక్సెస్ అయ్యారా అని అన్నారు. జనసేన-టీడీపీ పొత్తు హిట్ అయిందట.. ప్యాకేజీ విషయంలో మాత్రమే హిట్ అయ్యారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు జైలుకి వెళ్ళగానే దానిని ఆసరాగా తీసుకుని పవన్ ఎక్కువ ప్యాకేజి పొందాడని పేర్కొన్నారు. 10 చోట్లనైనా జనసేనకు అభ్యర్థులు ఉన్నారా అని ప్రశ్నించారు. 175 చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా లేని పవన్ యుద్ధం చేస్తానంటే అందరూ నవ్వుకుంటున్నారు అని తెలిపారు.
పందులు గుంపులు గుంపులుగా వచ్చినా.. సింహం సింగిల్ గానే వస్తుందన్నారు. ‘మీలాగా జగన్ గుంపుగా రారు.. సింగిల్ గానే వస్తారు’ పేర్కొన్నారు. ఢిల్లీ వెళ్లి పవన్ కళ్యాణ్ ఏదో చెప్తారట.. పవన్ ను మెడపట్టి అమిత్ షా గెంటేస్తారని పేర్కొన్నారు. తాము ఎన్నికలకు సిద్ధంగానే ఉన్నామని చెప్పారు. పక్కా ఆధారాలతోనే చంద్రబాబును అరెస్టు చేశారని వెల్లడించారు. చంద్రబాబు అడ్డంగా దోచేసి జైల్ కి వెళ్ళాడని తెలిపారు.
అవినీతి పరుడి కోసం పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా, చంద్రబాబు కుటుంబం ఫామిలీ విల విల లాడిపోతున్నారని చెప్పారు. చంద్రబాబుని అరెస్ట్ చేస్తే జనం స్పందించడం లేదని అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్సు లోనే తేలిపోయిందన్నారు. చంద్రబాబును అరెస్టు చేస్తే ఏదో అవుతుందనుకున్నారని పేర్కొన్నారు. చంద్రబాబుపై ప్రజలకు క్లారిటీ ఉందన్నారు. దొరికిన దొంగని జైలుకి పంపక జైలర్ సినిమాకి పంపిస్తారా అని అన్నారు.
చంద్రబాబు ఒత్తిడితో బోగస్ కంపెనీలకు నిధులు విడుదల చేశారని తెలిపారు. రూ.58 కోట్లకు సాఫ్ట్ వేర్ ఉంటే రూ.3 వేల కోట్లకు పెంచి గోల్ మాల్ చేసింది నిజం కాదా అని నిలదీశారు. పవన్, బ్రాహ్మణికి ఇది ఎందుకు అర్థం కావడం లేదన్నారు. సీమన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్ ఓ పెద్ద దొంగ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దొంగ చెప్పే మాటలు ఎవరు పట్టించుకుంటారని తెలిపారు. సుమన్ బోస్ మాజీ ఎండి ఎందుకయ్యారని చెప్పారు.
సీమన్స్ సంస్థ కోర్టులోనే ఈ వ్యక్తి తమకు తెలియకుండా చేశాడని కోర్టులోనే చెప్పారని పేర్కొన్నారు. ‘బ్రహ్మస్తాం అనుకుని బ్రాహ్మణి అస్త్రాన్ని వదిలారు.. బ్రాహ్మణి అస్త్రం కూడా తుష్ మందని ఎద్దేవా చేశారు. బ్రాహ్మణి కొంప తీసి సిద్దార్థ్ లుధ్రాని తీసేసి దేవన్స్ ని పెడతా అనలేదు అని చమత్కరించారు. బ్రాహ్మణి.. మీ మావ ఎంత పెద్ద దొంగో నీకు తెలియదా? ఓ సారి మీ తాత ఎన్టీఆర్ వీడియోలు విను మీ మావ చరిత్ర ఏంటో చెప్తారు. బ్రహ్మణి మీ మామ ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేసాడు.. అది నీకు తెలుసా’ అని అన్నారు.
చంద్రబాబు దేశానికి ఐటి తెచ్చాడని బ్రాహ్మణి అంటోంది.. బ్రాహ్మణి మామ ముఖ్యమంత్రిగా చేశాడా లేక ప్రధాన మంత్రిగా చేశాడా అని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో ఐటి కంపెనీలు కూడా చంద్రబాబు వల్ల వచ్చాయా అని నిలదీశారు. బ్రాహ్మణి, పవన్ కళ్యాణ్ కి ఆధారాలు చూడాలని అనుకుంటే సిఐడి ఆఫీస్ కి వెళ్ళాలని సూచించారు.
స్కిల్ డెవలప్ మెంట్ లో చంద్రబాబు దోచుకుంటే జగన్ ఉద్యోగాలు ఇచ్చారని తెలిపారు. 2.06 లక్షల మందికి జగన్ శాశ్వత ఉద్యోగాలిచ్చారని వెల్లడించారు. ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తున్న వ్యక్తి జగన్ అని కొనియాడారు. టీడీపీ మేనిఫెస్టోలోని ఏ ఒక్క హామీని చంద్రబాబు అమలు చేయలేదని విమర్శించారు.