సంచలన తీర్పు : హత్య కేసులో నిందితుడికి ఉరి

నెల్లూరు జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. హరనాథపురంలో తల్లీ, కుమార్తె హత్య కేసులో నిందితుడు ఇంతియాజ్‌కు ఉరి శిక్ష విధిస్తూ తీర్పును చెప్పడం సంచలనం సృష్టించింది.
ప్రధాన నిందితుడు ఇంతియాజ్‌కి ఉరిశిక్ష విధిస్తూ నెల్లూరు 8వ అదనపు కోర్టు 2020, ఫిబ్రవరి 06వ తేదీ గురువారం తీర్పు ఇచ్చింది.
2013 ఫిబ్రవరి 12న మెడికో భార్గవి, ఆమె తల్లి శకుంతల హత్యకు గురయ్యారు. తండ్రి దినకర్‌రెడ్డిపై హత్యాయత్నం చేశారు. భార్గవి, ఆమె తల్లి శకుంతల హత్య కేసులో ముగ్గురు నిందితులపై కేసులు నమోదయ్యాయి. పలు హత్య కేసుల్లో ఇంతియాజ్ నిందితుడిగా ఉన్నాడు. ఇప్పటికే ఈ కేసులో జువైనల్ కోర్టులో మూడేళ్ల శిక్ష అనుభవించారు ఇద్దరు మైనర్లు.
నగరంలోని వాగ్దేవి డి – ఫార్మసీ కళాశాల కరస్పాండెంట్ ఎ. దినకర్ రెడ్డి, స్థానిక హరనాథపురం రెండో వీధిలో భార్య, కుమార్తెతో నివాసం ఉంటున్నారు. కూతురు భార్గవి నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాలలో మూడో సంవత్సరం MBBS చదువుతోంది. హరనాథపురంలో నిర్మిస్తున్న కొత్త నిర్మాణానికి ఎలివేషన్ ప్లాన్ తయారు చేసుకొనేందుకు ఒకరిని కలిశారు దినకర్.
2013 ఫిబ్రవరి 12వ తేదీన దినకర్ రెడ్డి భార్య శకుంతల, కుమార్తె భార్గవి ఇంటి దగ్గరే ఉన్నారు. ఇద్దరు బాలలతో, ప్లానింగ్ డిజైనర్ దినకర్ ఇంటికి వచ్చాడు. కానీ..కత్తులు, రాడ్లతో బెదిరించి..నగలు దోచుకొనేందుకు ప్రయత్నించారని, అడ్డుకున్న తల్లి, కూతురును హత్య చేశారు.