Chandrabau Naidu : వైసీపీ సినిమా అయిపోయింది, ఇక 100 రోజులే, ఎంతమంది ఉన్నా రూ.15వేలు ఇస్తాం- చంద్రబాబు హాట్ కామెంట్స్

వైసీపీ పాలనలో నా లాంటి వారికే రక్షణ లేదు. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. వైసీపీకి ప్రజాస్వామ్యం అంటే ఏంటో చూపిస్తాం.

Chandrabau Naidu : వైసీపీ సినిమా అయిపోయింది, ఇక 100 రోజులే, ఎంతమంది ఉన్నా రూ.15వేలు ఇస్తాం- చంద్రబాబు హాట్ కామెంట్స్

Chandrabau Naidu

Updated On : December 28, 2023 / 7:35 PM IST

జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. వైసీపీ సినిమా అయిపోయిందన్న చంద్రబాబు, వైసీపీ ప్రభుత్వానికి ఇక మిగిలింది 100 రోజులే అని చెప్పారు. ఒక్క ఛాన్స్ అని అడిగి రాష్ట్రాన్ని ముంచేశారు అని సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు చంద్రబాబు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. గుడుపల్లి సభలో మాట్లాడారు. కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ రావాలన్నారు చంద్రబాబు. గుండెకాయ లాంటి గుడుపల్లిలో మొత్తం ఓట్లు టీడీపీకే పడాలన్నారు చంద్రబాబు.

”వైసీపీ పాలనలో నా లాంటి వారికే రక్షణ లేదు. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. వైసీపీ ప్రభుత్వానికి ఇక మిగిలింది 100 రోజులే. వైసీపీకి ప్రజాస్వామ్యం అంటే ఏంటో చూపిస్తాం. జగన్ పాలనలో పోలీసులు కూడా మనసు చంపుకుని పని చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పోలీసులు ముందుకు రావాలి.

Also Read : పవన్ కల్యాణ్ వేట.. గెలుపు గుర్రాల ఎంపిక కోసం స్వయంగా రంగంలోకి, ముందుగా అక్కడి నుంచే

35 ఏళ్లుగా నన్ను ఇక్కడ గౌరవిస్తున్నారు. కుప్పం నా సొంత కుటుంబం. లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంతో ఇక్కడ ముందుకు వెళుతున్నా. నన్నే ఇబ్బంది పెట్టారు. ఇక వారికి మీరు ఓ లెక్కా? వైసీపీ సినిమా అయిపోయింది. ఇక వారికి మిగిలింది వంద రోజులే. వంద కంటే ఎక్కువ తప్పులు చేశారు. ఎన్నికల కమిషన్ ఆపరేషన్ లోకి వచ్చింది. పోలీసులు ఇది గుర్తు పెట్టుకోవాలి. వెనుకబడిన ప్రాంతం అభివృద్ధి చేయాలనే నేను కుప్పంను ఎంపిక చేసుకున్నాను.

మేము హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ అమలు చేసి తీరుతాం. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ రూ.15వేలు చొప్పున ఇస్తాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తాం. యువతకు నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి ఇస్తాం. ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. 20లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత నాది” అని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

Also Read : ఏపీలో ఈసారి గెలుపు ఎవరిది? టీడీపీ ప్లస్ పాయింట్స్ ఏంటి? మైనస్ పాయింట్స్ ఏవి?

మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు సీఎంని- చంద్రబాబు
ఇక వైసీపీలో సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ”ఎమ్మెల్యేలు చెడిపోయారు అని జగన్ అంటున్నారు. ఎమ్మెల్యేలకు దొంగ పనులు నేర్పింది నువ్వే కదా? నీ సహకారం లేకుండా వాళ్ళు ఇలా చేస్తారా? ఎమ్మెల్యేల తప్పులకు కారణం సీఎం జగన్. మీకు వాటా ఇచ్చే మనిషికి పెద్ద పీట వేస్తున్నారు. వాటా ఇవ్వకపోతే టిక్కెట్ తీసేస్తున్నారు. మారాల్సింది ఎమ్మెల్యేలు కాదు, సీఎం మారాలి. క్వారీ మంత్రి ఓ గజదొంగ. అతనికి టికెట్ నిరాకరించగలవా? నేనే దొంగలను పట్టించినా మారలేదు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి దోచుకుందాం.. దాచుకుందాం.. అని పేరు పెట్టుకోవాలి. వచ్చే వంద రోజులు నా కోసం పని చేయండి. అత్యధిక ఓట్లతో కుప్పంలో గెలిపించండి” అని చంద్రబాబు అన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు అక్కడే ఉంటారు. బెంగళూరు నుంచి కుప్పం చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. కర్నాటక బోర్డర్ నుంచి గుడుపల్లి వరకు ర్యాలీగా చేరుకున్నారు చంద్రబాబు. గుడుపల్లిలో చంద్రబాబు మొదటి బహిరంగ సభలో పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారిగా తన సొంత నియోజకవర్గానికి వెళ్లారు. దీంతో కుప్పం జనసంద్రంగా మారింది. పార్టీ కేడర్, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అటు జనసేన కేడర్, పవన్ కల్యాణ్ అభిమానులు కూడా చంద్రబాబు సభలో పాల్గొన్నారు.

Also Read : వైఎస్ షర్మిల టీడీపీకి దగ్గర అవుతున్నారా? జగన్ సోదరి వ్యూహం ఏంటి?

టీడీపీ, జనసేన జెండాలు రెపరెపలాడాయి. గుడుపల్లిలో చంద్రబాబుకి అపూర్వ స్వాగతం లభించింది. జనసేన క్యాడర్ కూడా ఈ దఫా చంద్రబాబు పర్యటనలో పూర్తి స్థాయిలో భాగస్వామ్యం అయ్యింది. జనసేన కార్యకర్తలు చంద్రబాబుకి పెద్ద ఎత్తున బ్యానర్లు కట్టి స్వాగతం పలికారు.