కాంగ్రెస్‌లోకి వైఎస్ షర్మిల..! వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు, మళ్లీ జగనే సీఎం అంటూ ధీమా
జగన్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు వైసీపీని గెలిపిస్తాయి. వచ్చే ఎన్నికల్లో కొంతమందికి టికెట్ ఇచ్చే అవకాశం లేదు. వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నాము.

YV Subba Reddy Key Comments On YS Sharmila
YV Subba Reddy : వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నారన్న వార్తలపై వైసీపీ ఉత్తరాంధ్ర వ్యవహారాల ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారాయన. షర్మిల కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తనకు ఎలాంటి సమాచారం లేదని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలోనే షర్మిల కాంగ్రెస్ లో చేరతారని ప్రచారం జరిగిందని గుర్తు చేశారు. అయితే, ఎవరు ఏ పార్టీలో చేరినా వైసీపీకి ఎలాంటి ఇబ్బంది లేదని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. నెల రోజుల తర్వాత విజయమ్మని కలిసేందుకు హైదరాబాద్ వెళ్లానన్నారు. కుటుంబసభ్యులను కూడా కలవకూడదా? అని ఆయన ప్రశ్నించారు. తాను షర్మిలతో ఎలాంటి రాయబారాలు చేయలేదని వైవీ సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు.
ఇక వైసీపీ నుంచి కొందరు వ్యక్తిగత కారణాలతోనే వెళ్లిపోతున్నారని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. ఎన్నికల సమయంలో సీట్ల మార్పు సహజం అన్నారాయన. టికెట్ రాని వారికి వైసీపీ ప్రభుత్వం వచ్చాక సరైన అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.
Also Read : షర్మిల నిర్ణయంతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?
”ఎవరు ఏ పార్టీలో చేరినా వైసీపీకి ఇబ్బంది లేదు. ప్రజలు జగన్ తోనే ఉంటారు. మేమంతా జగన్ వెంట ఉంటాం. రాబోయే రోజుల్లో తప్పకుండా మళ్లీ జగనే సీఎం అవుతారు. జగన్ చేసిన సంక్షేమ కార్యక్రమాలే వైసీపీని గెలిపిస్తాయి. కొందరు వ్యక్తిగత కారణాలతోనే పార్టీ మారుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కొంతమందికి టికెట్ ఇచ్చే అవకాశం లేదు. వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నాము. అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. డాడి వీరభద్రరావుకి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. అయన రాజీనామా చేసిన విషయం నా దృష్టికి వచ్చింది. ఎన్నికల సమయంలో పార్టీలు మారడం సహజం” అని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
‘వైఎస్ షర్మిల మూడేళ్ల కిందటే తెలంగాణలో పార్టీ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలు ఏం జరుగుతున్నాయో దాని గురించి నాకు ఎలాంటి సమాచారం లేదు. ఎక్కడ ఎవరు ఏ పార్టీలో చేరినా ఏపీలో వైసీపీకి ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రజలు జగన్ తోనే ఉంటారు. మళ్లీ జగనే సీఎం అవుతారు. చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ అంతా కలిసి వస్తున్నారు కదా. అంతా కలిసి వచ్చినా జగన్ ను ఎదుర్కొనే ధైర్యం లేక కుట్రలు చేస్తున్నారు. అబద్దపు రాతలు రాసి మేము భయపడిపోతున్నట్లు ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు. ఎన్నికల సమయంలో కొన్ని సీట్లు మార్చడం సహజం.
Also Read : కాంగ్రెస్ గూటికి వైఎస్ షర్మిల.. ఈనెల 4న వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటన
వ్యక్తిగత కారణాలతో కొందరు వేరే పార్టీలకు వెళ్తున్నారు. సీట్ల మార్పునకు సంబంధించి సీఎం జగన్ గత ఏడాది నుంచి చెబుతూనే ఉన్నారు. 175 స్థానాలు గెలవాలని ప్రయత్నం చేద్దాం. ఎక్కడన్నా అవసరమైతే, అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉన్నా, పార్టీ నష్టపోకుండా ఉండటం కోసం మార్పులు చేర్పులు అవసరం అవుతాయి అని జగన్ పలు సందర్భాల్లో చెప్పారు. ఆ మార్పులు చేర్పులకు మీరు అంతా సహకరించాలని జగన్ కోరారు. మన ప్రభుత్వం వచ్చాక రాబోయే రోజుల్లో మీ అందరికీ మేలు చేసే కార్యక్రమం చేస్తామని పలు సందర్భాల్లో జగన్ చెప్పారు’ అని వైవీ సుబ్బారెడ్డి గుర్తు చేశారు.