నమస్తే పెట్టలేదని : యువకులపై దాడి చేసి బైక్ తగల బెట్టారు..

హైదరాబాద్ రహ్మత్ నగర్ లో చోటా లీడర్ రెచ్చిపోయాడు. మర్యాద ఇవ్వలేదని, నమస్తే పెట్టలేదనే కారణంతో ఇద్దరు యువకులపై దాడికి పాల్పడి, బైక్ తగల బెట్టాడు. పోలీసుల కథనం ప్రకారం రహ్మత్ నగర్ లో చోటా లీడర్ అరుణ్ కుమార్, తన గ్యాంగ్ వారికి మర్యాద ఇవ్వడం లేదని, నమస్తే పెట్టలేదని కారణంతో గల్లీలో కూర్చున్న ఉమాకాంత్, మనోజ్ లపై దాడికి పాల్పడ్డారు. ఉమాకాంత్ స్క్రూటీని తగుల బెట్టారు. దీంతో బాధితుడు జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. నమస్తే పెట్టలేదని దాడి చేశాడంటూ పోలీసుల ముందు వాపోయాడు. అకారణంగా దాడికి పాల్పడ్డారని, కత్తితో చంపేస్తామని బెదిరించారని ఉమాకాంత్, మనోజ్ పోలీసులకు తెలిపారు.
పోలీసులు అతన్ని తీసుకొని ఘటనాస్థలికి వెళ్లారు. అయితే పోలీసుల ముందే అరుణ్ గ్యాంగ్ బాధితులకు వార్నింగ్ ఇచ్చారు. బాధితుల పట్ల అరుణ్ కుమార్ దురుసుగా ప్రవర్తించాడు. పోలీసుల సమక్షంలోనే ‘అంతం చూస్తానంటూ’.. బాధిత యువకులకు బెదిరించాడు. పోలీసులను నెట్టివేస్తూ వారిపైకి దూసుకెళ్లే ప్రయత్నం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.