నాకు కరోనా ఉంది, ఎవరూ తాకొద్దు.. మహిళా ఉద్యోగిని ఆత్మహత్య

కరోనా వైరస్ మహమ్మారి ప్రాణాంతకమే. కానీ, చికిత్స తీసుకుంటే కరోనాను జయించడం పెద్ద విషయమేమీ కాదు. 90ఏళ్ల వృద్ధులు కూడా కొవిడ్ ను జయిస్తున్నారు. కోలుకుని మళ్లీ సాధారణ జీవితం గడుపుతున్నారు. ఇవన్నీ కళ్లారా చూస్తున్నా, వింటున్నా.. కొందరిలో మార్పు రావడం లేదు. అనవసరంగా భయపడి ఆత్మహత్య చేసుకుంటున్నారు. లేనిపోని అపోహలు, అనుమానాలు, ఆందోళనలతో బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ లో అలాంటి ఘటన ఒకటి జరిగింది. కరోనా భయంతో ఓ మహిళా ఉద్యోగిని సూసైడ్ చేసుకుంది.
అనుమానాస్పద స్థితిలో ఓ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన నార్సింగి పోలీసుస్టేషన్ పరిధి అల్కాపూర్‌లో చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాకు చెందిన గృహిణి(37) ఓ సంస్థలో పనిచేస్తూ.. అల్కాపూర్ కాలనీలో భర్త, కొడుకు(12)తో కలిసి ఉంటోంది. ఆమె భర్త ఆన్‌లైన్‌లో వంటసరకుల వ్యాపారం చేస్తుంటారు. శనివారం(ఆగస్టు 15,2020) రాత్రి భోజనాల తర్వాత భార్య, భర్త, కొడుకుతో కలిసి ఒకే గదిలో పడుకున్నారు. ఉదయం 9.50 గంటలకు నిద్రలేచిన ఆమె కొడుకుని నిద్రలేపగా లేవలేదు. పక్క గదిలోకి వెళ్లిన ఆమె ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
ఆ తర్వాత నిద్రలేచిన భర్త, భార్య కోసం చూడగా పక్కగదిలో శవమై కన్పించింది. ‘నన్ను ఎవరూ తాకొద్దు. నాకు కొవిడ్ పాజిటివ్’ అని… రాసి పెట్టిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఒకవేళ తాను కొవిడ్ బాధితురాలై ఉంటే రాత్రి అందరితో కలిసి ఎలా నిద్రించిందని, ఎక్కడ పరీక్షలు చేయించుకుంది.. ఫలితం ఎప్పుడు తెలిసింది. అనే విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. మహిళ మృతి మిస్టరీగా మారింది. పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.